టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై పోలీసులు పెట్టిన కేసులన్నీ రాజ్యాంగ విరుద్ధమంటూ హైకోర్టును ఆశ్రయించిన రవిప్రకాష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. వివరాల్లోకి వెళితే..
గత వారం అనూహ్యంగా రవిప్రకాశ్ మీద ఫోర్జరీ, డేటా చౌర్యం లాంటి ఆరోపణలు రావడం, పోలీసు కేసులు నమోదు కావడం, ఆ తర్వాత పరారీలో ఉన్నాడని వార్తా చానల్ ప్రసారం చేయడం, రవి ప్రకాష్ టీవీ9 లైవ్ లోకి వచ్చి అవన్నీ తప్పుడు వార్తలు అని చెప్పడం, కానీ మరుసటి రోజే టీవీ9 మేనేజ్మెంట్ ఛానల్ పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవడం, ఆ తర్వాత రవి ప్రకాష్ ఆచూకీ లభించడం లేదని పోలీసులు నిర్ధారించడం తెలిసిందే. అయితే, తన పై పోలీసులు పెట్టిన కేసులన్నీ కుట్రపూరితం అని, రాజ్యాంగ విరుద్ధమని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో రవిప్రకాష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని కూడా కోరారు. అయితే హైకోర్టు మాత్రం దీన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
ఇప్పుడు అత్యవసరంగా జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించడంతో రవి ప్రకాష్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది అర్థం కావడం లేదు. పోలీసులు ఇప్పటికే సెక్షన్ 41 కింద నోటీసు ఇవ్వడంతో, దానికి రవి ప్రకాష్ స్పందించకపోవడంతో, ఆ కారణం చేత రవి ప్రకాష్ ని అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.