టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ దక్షిణాదిలోని అన్ని ప్రముఖ భాషల్లో న్యూస్ చానల్స్ ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కొత్త యాజమాన్యం టీవీ9 నుంచి రవిప్రకాష్‌ను .. కేసులు పెట్టి, వేధించి బయటకు పంపేయడంతో ఆయన.. మరింత పట్టుదలగా..ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. రవిప్రకాష్ ప్రాజెక్టుకు పెట్టుబడి పెట్టేందుకు కూడా.. పలువురు ఆసక్తి చూపించినట్లుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చాలా పరిమిత వనరులతో.. ఒకప్పుడు.. టీవీ9ని ప్రారంభించి.. దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించిన నైపుణ్యం రవిప్రకాష్ సొంతం. ఈ ఇమేజ్ ఇప్పుడు.. బాగా ఉపయోగపడుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ చానల్స్ కోసం ఇప్పటికే ప్రిపరేషన్స్ ప్రారంభించారు.
ప్రస్తుతం మీడియా రంగం… ఓ నిద్రాణ స్థితికి చేరుకుందన్న భావన ప్రజల్లో ఉందని రవిప్రకాష్ అంచనా వేస్తున్నారు. పాలక వర్గాలకు బాకా ఊదడం… బాధితులకు అండగా నిలకవకపోవడం… వేధింపులకు గురవుతున్న వారినే… మీడియా టార్గెట్ చేయడం… అంతా కలిసి ప్రజల్లో ఓ రకమైన అసంతృప్తి కనిపిస్తోందని అంటున్నారు. ఇలాంటి సమయంలో.. తన డేరింగ్ అండ్ డైనమిక్ చానల్స్ … ప్రజల ఆదరణను.. అనతి కాలంలోనే చూరగొంటాయని నమ్ముతున్నారు. బ్రాండ్ రవిప్రకాష్.. దీనికి అదనపు బలం అయ్యే అవకాశం ఉంది.
టీవీ9లో రవిప్రకాష్ తో పని చేసిన అనేక మంది ఉద్యోగులు… ప్రస్తుత యాజమాన్యం కింద ఇమడలేకపోతున్నారు. సాక్షాత్తూ.. రవిప్రకాష్ స్థానంలో నియమితులైన సీఈవో కూడా… బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో.. పలువురు .. చానల్స్ నిర్వహణ కార్యకలాపాల్లో ఉన్న వారు.. కొత్త యాజమాన్యం తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లుగా చెబుతున్నారు. వారంతా.. రవిప్రకాష్ తో టచ్‌లో ఉన్నారంటున్నారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి.. కొత్త చానల్స్ కు సంబంధించిన పనులు… లాంఛనంగా రవిప్రకాష్ టీం ప్రారంభించబోతోంది. వీలైనంత త్వరగా వాటిని ఎయిర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రవిప్రకాష్ టీం .. త్వరలోనే చేసే అవకాశం ఉంది.