టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు నిన్ననే బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. అవసరమైన పత్రాలు అందజేయడంలో ఆలస్యం కావడంతో… నిన్న విడుదల కాలేకపోయారు. ఈ ఉదయం అవసరమైన పత్రాలన్నీ చంచల్ గూడ జైలులో సమర్పించడంతో.. ఆయనను విడుదల చేశారు. పలువురు జర్నలిస్టులు.. జైలు వద్దకు వచ్చి స్వాగతం పలికారు. టీవీ9 కొత్త యాజమాన్యం… అక్రమంగా బోనస్ తీసుకున్నారనే కేసు నమోదు చేయడంతో.. ఆయనను పోలీసులు ఈ నెల ఐదో తేదీన అరెస్ట్ చేశారు. వారం రోజుల కిందట.. ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ.. కొత్తగా నకిలీ ఈ మెయిల్ సృష్టించారంటూ..మరో కేసు నమోదు చేసి.. రిమాండ్ కు తరలించారు. అయితే.. ఈ కేసులన్నీ దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని హైకోర్టు మండిపడి.. బెయిల్ మంజూరు చేసంది.
రవిప్రకాష్‌పై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టి.. జైల్లో పెట్టారని.. ఆయన బయటకు రాకుండా.. ఒకటి తర్వాత ఒకటి కేసులు పెట్టి.. జైల్లోనే ఉంచే ప్రణాళికలు సిద్ధం చేశారన్న ప్రచారం జరిగింది. అయితే.. హైకోర్టు ఆగ్రహంతో.. చివరికి పోలీసులు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. జైల్లోఉన్నప్పుడు రవిప్రకాష్.. పలు అంశాలపై తన ప్రతినిధుల ద్వారా లేఖలు రాశారు. తాను ఏ మాత్రం వెనక్కి తగ్గబోనని బయటకు వచ్చిన తర్వాత.. పోరాటం సాగిస్తానని ప్రకటించారు. మీడియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు… భూకబ్జాదారులు ప్రవేశిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఇప్పుడు చూస్తున్నామని.. వారందరికి వ్యతిరేకంగా పోరాడుతామంటున్నారు.
టీవీ9 అమ్మకం డీల్ పై.. రవిప్రకాష్ అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై ఆయన మరింత దూకుడుగా పోరాడే అవకాశం ఉందని అంటున్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినందున.. తాను కూడా… తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలతో.. కోర్టుల్లో పిటిషన్లు వేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. టీవీ9 కొత్త యజమానుల్లో ఒకరైన.. మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు కార్యాలయాపై పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరిగాయి. ఈ క్రమంలో రవిప్రకాష్ వేయబోయే అడుగులు కీలకం కాబోతున్నాయి.