మహా సిమెంట్ పేరుతో సిమెంట్ అమ్మే మైహోం గ్రూప్, బిజినెస్ పార్టనర్లు అయిన మేఘా, అల్లు అరవింద్‌లను టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అసలు వదిలి పెట్టడం లేదు. సంచలన విషయాలను వెలుగులోకి తెస్తూనే ఉన్నారు. తాజాగా ఐటీ దాడులపై ఆయన చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ఐదు రోజుల పాటు జరిగిన ఐటీ అధికారుల సోదాల్లో అభిషేక్ అగర్వాల్ అనే నిర్మాత ఇల్లు కార్యాలయాలు ఉన్నాయి. తెలుగులో కొన్ని సినిమాలు తీసినా…తీస్తున్నా కశ్మీర్ ఫైల్స్ నిర్మాతగా ఆయనకు దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది.
ఇప్పుడీ అభిషేక్ అగర్వాల్ ఇంట్లో లెక్కకు అందని కోట్ల రూపాయల లెక్క బయట పడినట్లుగా రవిప్రకాష్ చెబుతున్నారు. దాదాపుగా రూ. 90 కోట్ల వరకూ విదేశీ లావాదేవీలు గుర్తించారు. దీనికి లెక్కలే లేవని త్వరలో స్విస్ ఫైల్స్ అనే సినిమా తీసుకోవాల్సి ఉందని సెటైర్ వేశారు. అదే సమయంలో పుష్ప సినిమా కలెక్షన్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కూడా ఐటీ అధికారులు సేకరించారని అంటున్నారు. అందులో ఉన్న అసలు సిసలు లొసుగుల్ని కూడా పట్టేసినట్లుగా రవిప్రకాష్ హింట్ ఇస్తున్నారు. ఇప్పుడు పుష్ప హీరో చిక్కుల్లో ఉన్నట్లేనని రాజకీయ ఆశీస్సులతో ఆయన బయటపడగలరా అనే సందేహం వ్యక్తం చేశారు.
ఇదే కాదు అల్లు అర్జున్ కు ఐదు శాతం వరకూ భాగస్వామ్యం ఉన్న ఆహా ఓటీటీ అంశంలోనూ రవిప్రకాష్ సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. మైహోం గ్రూప్‌తో కలిసి అల్లు అరవింద్, ఇతర భాగస్వాములు ఈ ఓటీటీని నడిపిస్తున్నారు. ఇది ఇప్పటికే రూ. 420 కోట్ల రూపాయలను నష్టపోయిందని.. ఇప్పటికీ ఏడాదికి వంద కోట్లు లాస్ వస్తోందని రవిప్రకాష్ స్పష్టం చేశారు. దీన్ని కాపాడటానికి టీవీ9 నుంచి 90 కోట్ల రూపాయలు మళ్లించారని తెలిపారు. టీవీ9లో తాను ఇప్పటికీ వాటాదారుడినని రవిప్రకాష్ గుర్తు చేస్తున్నారు. తన కుమారుడి వైఫల్యాన్ని బయట పడకుండా చేసేందుకు టీవీ9 సొమ్మును అహాలోకి మళ్లిస్తున్నారని ఆయన అంటున్నారు. ఆహా బాగుందని.. అన్ స్టాపబుల్ అని పీఆర్ ప్రచారం చేసుకుంటున్నా అసలు నిజం మాత్రం ఇదే అ అని స్పష్టం చేశారు.
రవిప్రకాష్ ఇటీవల మేఘా కృష్ణారెడ్డిని మరో హర్షద్ మొహతాగా అభివర్ణిస్తూ ట్వీట్ పెట్టారు. బ్యాంకుల నగదును తీసుకుని హర్షద్ మొహతా స్టాక్ మార్కెట్ వ్యాపారం చేస్తే.. మేఘా కృష్ణారెడ్డి.. కాంట్రాక్టులు పొంది అడ్వాన్సులు తీసుకుని..పర్యావరణ అనుమతులు.. ఇతర అనుమతుల పేరుతో పనులు ప్రారంభించకుండా ఆ అడ్వాన్సులు వేల కోట్లను సొంతానికి వాడుకుంటున్నారని బయట పెట్టారు. అంతకు ముందు బ్యాంక్ గ్యారంటీల స్కామ్‌ను కూడా బయట పెట్టారు.
రవిప్రకాష్ బ్రెయిన్ చైల్డ్ అయిన టీవీ9 ను ఆయన చేతుల నుంచి మైహోం రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి బలవంతంగా లాక్కున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయనపై కేసులు పెట్టి జైలు పాలు చేశారు. అందుకే రవిప్రకాష్ .. ఆ రెండు సంస్థలు..వాటితో భాగస్వామ్యం ఉన్న వారి అవకతవకల్ని ఎప్పటికప్పుడు బయట పెట్టేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదని భావిస్తున్నారు.