చిరంజీవికి ఉన్న వీరాభిమానుల్లో రవితేజ ఒకడన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరుని స్ఫూర్తిగా తీసుకొని సినిమాల్లోకి వచ్చిన రవితేజ, అంచెలంచెలుగా ఎదిగి, మాస్ మహారాజాలా మారిపోయాడు. ఇప్పుడు చిరంజీవితో కలిసి నటించే స్థాయిలోకి చేరాడు. వీరిద్దరూ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఈనెల 13న రాబోతోంది. ఈ సినిమా విజయంపై… రవితేజ సూపర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. ఎప్పుడూ తన సినిమా గురించి ఎలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వని రవితేజ.. తొలిసారి… ‘వాల్తేరు వీరయ్య’ గురించి ఓ రేంజ్ లో హైప్ ఇచ్చాడు. ”సూపర్ హిట్ అనేది చాలా చిన్నమాట.. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. గ్యారెంటీ.. సక్సెస్ మీట్లు చాలా పెట్టుకొంటాం” అంటూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అభిమానులకు పూనకాలు తెప్పించాడు. ఈ సందర్భంగా చిరంజీవి నటించిన ‘విజేత’ ఫంక్షన్లో జరిగిన ఓ విషయాన్ని గుర్తు చేసుకొన్నాడు.
చిరంజీవి నటించిన ‘విజేత’ సినిమా వేడుక విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో జరిగింది. ఆ ఫంక్షన్ కి ఓ అభిమానిగా వెళ్లాడు రవితేజ. అప్పటికే ఫంక్షన్ స్టార్ట్ అయిపోవడం వల్ల…. వేదికకు చాలా దూరంగా నిలబడిపోవాల్సివచ్చిందట. స్టేజీపై చిరంజీవి, భానుప్రియ కూర్చుని ఉంటే.. తన ఫ్రెండ్స్ తో ”నేనూ ఏదో ఓ రోజు…. ఆ వేదికపై చిరంజీవి పక్కన కూర్చుంటా” అని శపథం చేశాడట. సినిమాల్లోకి వచ్చి… దాన్ని నిజం చేసుకొన్నాడు రవితేజ. ఈ సినిమా జరుగునన్ని రోజులూ.. చిరుకి అత్యంత సన్నిహితంగా మెలిగానని, చిరు తనని చాలా ప్రేమించారని, ఆల్మోస్ట్ చంక ఎక్కేశానని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు రవితేజ. చిరులోని పాజిటీవ్ ఎనర్జీని ఎక్కడా చూళ్లేదని, చిరు మధ్యలో తొమ్మిదేళ్లు సినిమాలకు దూరమయ్యారని, అలాంటి విరామం మళ్లీ ఎప్పుడూ రాకూడదని చెప్పుకొచ్చాడు మాస్ మహారాజ్.