మన హీరోలకు పాటలు పాడడం భలే సరదా. స్టార్ హీరోలంతా ఎప్పుడో ఒకప్పుడు గొంతు సవరించుకున్నవాళ్లే. రవితేజ కూడా ఇది వరకు గాయకుడిగా తన అవతారం చూపించేశాడు. డిస్కోరాజా, పవర్, బలుపు చిత్రాల్లో పాటలు పాడాడు. ఇప్పుడు మరోసారి.. గొంతు సవరించుకున్నాడు. `ఖిలాడీ` కోసం. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. వచ్చే ఏడాది విడుదల అవుతోంది. ఈ చిత్రం కోసం రవితేజ ఓ పాట పాడాడు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సరదా ట్యూను రవితేజ గొంతులోనే బాగుంటుందని చిత్రబృందం భావించడం, ఆ వెంటనే రవితేజ పాడేయడం జరిగిపోయాయి. త్వరలోనే ఈ పాటని విడుదల చేయబోతున్నారు. రవితేజ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సెట్స్‌పై ఉన్నాయి. ఖిలాడీ షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.