ఈమధ్య రవితేజపై ఎన్ని రూమర్లో. ‘రామారావు ఆన్ డ్యూటీ’ని టార్గెట్ చేస్తూ గాసిప్ రాయుళ్లు రెచ్చిపోయారు. ఈ సినిమా ఒప్పుకొన్నప్పుడు రవితేజ చెప్పిన పారితోషికం ఒకటని, అయితే డబ్బింగ్ చెప్పే ముందు రవితేజ సడన్ గా పారితోషికం పెంచేశాడని, అడిగినంత పారితోషికం ఇస్తే గానీ, డబ్బింగ్ చెప్పనన్నాడని, పబ్లిసిటీకి కూడా రానని బెదిరించాడని… ఇలా రకరకాలుగా మాట్లాడుకొన్నారు. వాటన్నింటికీ రవితేజ ఇప్పుడు పుల్ స్టాప్ పెట్టాడు.
ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఆవిష్కరణలో రవితేజ పాల్గొన్న సంగతి తెలిసిందే. దాంతో… `’పబ్లిసిటీకి రాన’ని రవితేజ చెప్పడం రూమరే అని తేలిపోయింది. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చాడు. ”గాసిప్పులు వస్తుంటాయి.. అవన్నీ పనీపాటా లేనివాళ్లు రాస్తుంటారు. నేను వాటిని పట్టించుకోను. చూసి నవ్వుకుంటానంతే. అలాంటి వాళ్లు కూడా ఉండాలి. లేదంటే టైమ్ పాస్ అవ్వదు. ఈ సినిమాకి నేనొక నిర్మాతని. నా బ్యానర్ పేరు పోస్టర్ పై కనిపిస్తోంది. అలాంటప్పుడు పారితోషికం కోసం నేనెందుకు ఇబ్బంది పెడతాను? పైగా ఈ సినిమా నిర్మాత సుధాకర్ నాకు మంచి స్నేహితుడు. తను చాలా మంచోడు. తనకెవరకూ శత్రువులు ఉండరు. అంత మంచి నిర్మాత ఉన్నప్పుడు నాకెందుకు సమస్యలొస్తాయి” అని తేల్చేశాడు. నిజం చెప్పాలంటే.. ఇది వరకటి సినిమాలకంటే ఈ ‘రామారావు ఆన్ డ్యూటీ` ప్రమోషన్లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు రవితేజ. మరి ఇప్పుడైనా ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.