రవితేజ.. దట్టంగా కూరిన పటాస్లా ఉంటాడు. వెండి తెరపైనే కాదు. బయట కూడా. ఏళ్ల తరబడి ఎంటర్టైన్మెంట్కి కేరాఫ్ అడ్డా.. రవితేజనే. హిట్టూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా ఒకేలా దూసుకుపోతుంటాడు. తన చేతిలో ఉన్నన్ని సినిమాలు ఇప్పుడు ఏ ఇతర అగ్ర హీరో చేతిలో లేవు. ఈ యేడాది ముచ్చటగా మూడో సినిమా వస్తోంది. అదే ‘ధమాకా’. శుక్రవారం ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా తెలుగు 360తో ప్రత్యేకంగా ముచ్చటించాడు మాస్ మహారాజా.
* ఏ సినిమా ప్రమోషన్లలోనూ.. సినిమా గురించి పెద్దగా మాట్లాడరు.. హైప్ ఇవ్వరు… కారణమేంటి?
– నేను ఇప్పుడే కాదండీ.. ముందు నుంచీ ఇంతే. నా సినిమా గురించి నేనే చెప్పుకొంటే బాగోదు. సినిమానే మాట్లాడాలి. అదే నా సిద్ధాంతం.
* కానీ.. ఈ సినిమా ప్రమోషన్లలో చాలా విరివిగా పాల్గొంటున్నారు.. మంచి సినిమా చేస్తే ఆటోమెటిగ్గా ఆ జోష్ వచ్చేస్తుందా..?
– కావొచ్చు. కొన్నిసార్లు సినిమాలోని కంటెంటే.. కొత్త జోష్ ఇస్తుంటుంది. నిర్మాతలు, పీఆర్వోలు పబ్లిసిటీ ఐడియాలతో వచ్చినప్పుడు కాదనలేను.
ఈమధ్య మీ నుంచి సీరియెస్ సినిమాలే వస్తున్నాయని కంప్లైంట్ ఉంది..
– అవును.. కాకపోతే.. అన్నీ ట్రై చేయాలి కదా? చేయకపోతే.. ఒకే తరహా సినిమా చేస్తున్నా అనుకొంటారు. కొన్ని ట్రై చేశా. వర్కవుట్ అవ్వలేదు, ఏం చేస్తాం..? `ధమాకా` మాత్రం.. పూర్తి స్థాయి ఎంటర్టైనర్.
ఈ సినిమాని రౌడీ అల్లుడి సరికొత్త వెర్షన్లా పోల్చి చెబుతున్నారు.. మీకూ అదే అనిపించిందా?
– మా డైరెక్టరూ.. రైటరూ.. ఈ మాట చెప్పి ఉంటారు. రౌడీ అల్లుడు సినిమా బాగుంటుంది కదా? ఆ రోజుల్లో అన్నయ్యే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు. ఆ తరవాత.. మేం ఫాలో అయ్యాం.
త్రినాథరావు మీ అభిమాని కదా..? ఫ్యాన్ డైరెక్టర్ అయితే.. ఆ సౌలభ్యం వేరుగా ఉంటుందా?
– అలాగేం లేదు. త్రినాథరావు అనే కాదు.. ఏ దర్శకుడైనా ఓ అభిమానిలానే ఆలోచించాలి. నాతో పని చేసినవాళ్లంతా అలా ఆలోచించే సినిమాలు తీశారు.
మీ ఎనర్జీ కొంచెం భీమ్ కి ఇచ్చారా? పాటలు ఊగిపోతున్నాయి..?
– తను అదరగొట్టేశాడు. పాటలు మామూలుగా లేవు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వస్తుంది.
శ్రీలీల పెద్ద హీరోయిన్ అవుతుందని జోస్యం చెప్పారు. ఆ అమ్మాయిలో అంతగా ఆకట్టుకొన్న అంశాలేంటి?
– ఇప్పటికే తను పెద్ద హీరోయిన్ అయిపోయింది. భవిష్యత్తులో ఇంకా పై స్థాయికి వెళ్తుంది. అందం, నటన, జోష్, డాన్స్.. అన్నీ ఉన్న కథానాయిక తను. పైగా తెలుగమ్మాయి. అంతకంటే కావల్సింది ఏముంది..?
ఈమధ్య కొత్త రైటర్లని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు..?
– ఇప్పుడే కాదు. ఇది వరకూ అంతే. ప్రసన్న బాగా రాశాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. నక్కిన త్రినాథరావుదీ. ప్రసన్నది చాలా మంచి కాంబినేషన్. ఈ సినిమాతో అది మరోసారి ప్రూవ్ అవుతుంది.
వరుసగా ఇన్నేసి సినిమాలు ఎలా చేయగలుగుతున్నారు.. ఆ రహస్యం ఏమిటి?
– అన్నీ మంచి కథలు దొరుకుతున్నాయి. కథ బాగుంటే ఇంకేం ఆలోచించను. ఎన్ని సినిమాలైనా పట్టాలెక్కించేస్తా. ఎందుకంటే… నాకు షూటింగ్ అంటే పండగ. రోజూ షూటింగ్ కి వెళ్లినా బోర్ కొట్టదు. అలాంటప్పుడు ఎందుకు ఆలోచించాలి? ఎవరి కోసం ఆగాలి?
ఓటీటీలొచ్చాక… కథల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది కదా?
– కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తప్పదు. కానీ ఓటీటీల ప్రభావం థియేటర్లపై పెద్దగా ఉండదు. అది అదే.. ఇది ఇదే. ఓటీటీల్లో ఓరకమైన కథలు ఆడుతున్నాయని, వాటినే.. సినిమాల్లోకి తీసుకొస్తే కుదరదు.
వాల్తేరు వీరయ్య ఎలా ఉండబోతోంది?
– పూనకాలు లోడింగ్ అన్నారు కదా.. అలానే ఉంటుంది. పండక్కి వస్తుంది కదా… ఇక పండగే.
చిరంజీవిగారి కోసమే ఈ సినిమా ఒప్పుకొన్నారా?
– అన్నయ్యంటే ఎంతిష్టమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. పైగా కథ నచ్చింది. బాబీ నా సొంత మనిషి. ఇంకేం కావాలి..?
నిర్మాతగా మీ ప్లానింగ్స్ ఏమిటి?
– నాకు ప్లానింగ్స్ అంటూ ఏం ఉండవు. చేసుకొంటూ పోవడమే. నా బ్యానర్లో ఎలాంటి సినిమాలు వస్తాయో త్వరలో చెబుతా.
మీ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారా..?
– అబ్బో.. దానికి చాలా టైమ్ ఉంది. ఇప్పుడే కాదు.