సినిమాల్లో రవితేజ భారీ భారీ డైలాగులు చెబుతారేమో! మీడియా ముందు మాత్రమే స్వీట్ అండ్ సింపుల్ డైలాగులే చెబుతారు. ఆయన మాట్లాడేది కొంచెమే కావొచ్చు. అందులో కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే రవితేజ నటించిన తాజా సినిమా ‘నేల టికెట్టు’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా రవితేజతో ఇంటర్వ్యూ….
మీది ‘నేల టికెట్టు’ బ్యాచ్ యేనా?
హాండ్రెండ్ పర్సెంట్! చిన్నతనంలో మా తాతయ్యగారి వూరిలో చాలా సినిమాలను నేల టికెట్టు కొనుక్కుని చూశా. ఈతరం పిల్లలకు నేల టికెట్టు అంటే ఏంటో తెలీదు. వాళ్ల తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటున్నారు. నా చిన్నప్పుడు నేల, బెంచి, కుర్చీ వుండేవి.
నేల టిక్కెట్టులో చూసిన సినిమాల్లో మీకు బాగా గుర్తు వున్నది?
ఒక్కటి అని చెప్పలేను. చాలా వున్నాయి. ఇంట్లో ఒక్క సినిమాకి డబ్బులు తీసుకునేవాణ్ణి. బాల్కనీ టికెట్టుకి. ఆ డబ్బులతో నాలుగైదు నెల టికెట్టులు వచ్చేవి. వరుసగా నాలుగు రోజులు సినిమాలు చూడడమే. సినిమా పిచ్చోళ్లకి ఒక్క సినిమా అని కాదు… ప్రతి సినిమానీ చూసేయాలని అనుకుంటారు. నేను ఆ కోవకి చెందిన వాణ్ణి. విడుదలయ్యే ప్రతి సినిమా చూసేయాలని అనుకుంటాను.
మీ సినిమాకి వస్తే.. ‘నేల టికెట్టు’ అని టైటిల్ పెట్టారు. బాల్కనీవాళ్లకు నచ్చుతుందా?
అందరికీ నచ్చే సినిమా. కొత్త కథ అని చెప్పను కానీ.. ట్రీట్మెంట్ కొత్తగా వుంటుంది. నేల టికెట్టు ప్రేక్షకులను మాత్రమే కాదు.. బాల్కనీ ప్రేక్షకులకూ నచ్చుతుంది. మీకు ఓ విషయం చెప్పనా? బాల్కనీలో ప్రేక్షకులకు కూడా విజిల్స్ వేయాలని వుంటుంది. కానీ, పక్క సీట్లో ప్రేక్షకులు ఏమనుకుంటారో? అని వేయరు. మాది అన్ని వర్గాలకు నచ్చే సినిమా.
టైటిల్లో 420 అని పెట్టారు… మీది నకిలీ డాక్టర్ క్యారెక్టర్ అంటున్నారు.. సినిమా కథేంటి?
(నవ్వుతూ) కథేంటో నాతో చెప్పించేయాలని తిప్పి తిప్పి క్వశ్చన్స్ అడుగుతున్నారే? రెండు రోజులు ఆగండి. మొత్తం సినిమా చూపిస్తా.
మీ క్యారెక్టర్ ఏంటి?
‘చుట్టూ జనం మధ్యలో మనం… లైఫ్ అంటే అలా వుండాలిరా’ అనుకునే మనిషిగా కనిపిస్తా. వాడిలో అన్ని ఎమోషన్స్ వుంటాయి. బేసిగ్గా నేల మీద వున్నవాళ్లు ఆ విధంగా ఫీలవుతారు. అదే సినిమా చూపించాం.
ప్రచార చిత్రాల్లో ‘ముసలితనం అంటే చేతకాని తనం కాదురా! నిలువెత్తు అనుభవం’ అని డైలాగ్ వుంది. వృద్ధుల గురించి సినిమాలో సందేశం ఇస్తున్నారా?
మీరు ఏ డైలాగ్ గురించి అయితే అడిగారో.. అటువంటివి నచ్చే కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథను అంగీకరించా. ఈ రోజుల్లో తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు చాలామంది వున్నారు. అటువంటి పరిస్థితుల గురించి సినిమాలో డిస్కస్ చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నా.
ఈ సినిమా మీ స్టయిల్లో వుంటుందా? కళ్యాణ్ కృష్ణ స్టయిల్లో వుంటుందా?
కళ్యాణ్ కృష్ణ స్టయిల్లో వుంటుంది. తాను తీసిన రెండు సినిమాలు చూశా. మొదటి సినిమా మాసీగా వుంటుంది. రెండో సినిమాలో స్టయిలిష్ టచ్ వుంటుంది. దీన్ని మళ్ళీ మాసీగా తీశాడు.
రవితేజతో ఎప్పుడో ఈ సినిమా తీయాల్సిందని కళ్యాణ్ కృష్ణ ఆడియోలో చెప్పారు.
అవును. తాను చాలా రోజుల క్రితమే ఈ కథను నాకు చెప్పాడు. అప్పుడు నేను వేరే సినిమాలతో బిజీగా వున్నా. ‘ఈలోపు నీకు వేరే అవకాశాలు వస్తే చేసుకో’ అని చెప్పా. తాను ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో కళ్యాణ్ కృష్ణ బిజీ అయ్యాడు. ఇప్పటికి మాకు చేయడానికి వీలు పడింది. దర్శకుడు, హీరో కంటే ఇప్పుడు మీము మంచి ఫ్రెండ్స్ అయ్యాం
మధ్యలో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న మీరు ఇప్పుడు బిజీ అయ్యారు కదా!
అప్పుడు కుదరలేదు. ఇప్పుడు వరుస సినిమాలు కుదురుతున్నాయి. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను… ‘నేనేదీ ముందుగా ప్లాన్ చేయను. ఫ్యూచర్ గురించి ఆలోచించను’ అని. ఇప్పుడూ అంతే.
శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో నుంచి అనూ ఇమ్మాన్యుయేల్ ఎందుకు తప్పుకున్నారు?
ఆ అమ్మాయి కూడా చెప్పింది కదా! ‘శైలజారెడ్డి అల్లుడు’ షెడ్యూల్, మా షెడ్యూల్ క్లాష్ అయ్యాయి. మాది అమెరికాలో 50 రోజుల షెడ్యూల్. ఎక్కువమంది ఆర్టిస్టులు వున్నారు. ఆమె కోసం షెడ్యూల్ పోస్ట్‌పోన్ చేయలేము. అందుకని ఇలియానాను తీసుకున్నాం. త్వరలో అమెరికా వెళ్తున్నా.
అందులో మీ అబ్బాయి మహాధన్ కూడా చేస్తున్నట్టున్నాడు. అతని పాత్ర ఎలా వుంటుంది?
ముందు అనుకున్నాం కానీ.. ఇప్పుడు మహాధన్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో చేయడం లేదు. తన స్కూల్ డిస్ట్రబ్ అవుతుందని నేనే వద్దని చెప్పా. స్కూల్ టైంలో వాడి షూటింగ్ షెడ్యూల్స్ వచ్చాయి. అందుకని వాడితో క్యారెక్టర్ చేయించడం లేదు.
మహాధన్ మీ సినిమాల్లో మాత్రమే నటిస్తాడా? బయట హీరోల సినిమాల కూడా చేస్తాడా?
మంచి కథ, క్యారెక్టర్ వస్తే ఎందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు. అయితే… నేనే వాడి చేత ఎక్కువ సినిమాలు చేయించకూడదని అనుకుంటున్నా.
మీకు కంపిటీషన్ వస్తాడు అని భయమా?
భలే వారండీ! నన్ను దాటుకుని వాడు ముందుకు వెళితే.. అంతకన్నా ఏం కావాలి!
‘తెరి’ డబ్బింగ్ తెలుగులో విడుదలయ్యింది. మళ్లీ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీమేక్ చేయడం ఎందుకు?
సినిమా చూస్తే మీకు ఆ విషయం తెలుస్తుంది. ఆల్మోస్ట్ 70 శాతం కథ మారింది. చాలా కొత్తగా వుంటుంది మేము చేసే సినిమా.
వీఐ ఆనంద్ దర్శకత్వంలో డ్యూయల్ రోల్ సినిమా చేస్తున్నారట?
ఇప్పుడు అవన్నీ ఎందుకు? తరవాత మాట్లాడుకుందాం. మొత్తం సెట్ అయ్యాక… ఆ సినిమా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తా.