వైవిధ్యమైన కాన్సప్ట్ లతో తమిళనాట తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో విష్ణు విశాల్. ఇప్పుడు విష్ణు ద్రుష్టి తెలుగు మార్కట్ పై పడింది. నిజానికి ‘రాక్షసుడు’ సినిమాని నేరుగా తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని భావించాడు. కానీ నిర్మాత రీమేక్ హక్కులని అమ్మేయడం వలన కుదరలేదు. అయితే ఇప్పుడు హీరో రవితేజ, విష్ణుని తెలుగులో ప్రమోట్ చేయడనికి ముందుకు వచ్చాడు. విష్ణు నటిస్తున్న ‘ఎఫ్ఐఆర్’ సినిమాని రవితేజ సమర్పణలో తెలుగులో విడుదలౌతుంది. దీని తర్వాత విష్ణు చేసిన కొత్త సినిమా కూడా రవితేజ సమర్పణలో తెలుగులో విడుదల కానుంది. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా చెప్పాడు.
” రాక్షుసుడు సినిమా తెలుగులో విడుదల చేయాలని అనుకున్నా, కానీ కుదరలేదు. ఎఫ్ ఐఆర్ సినిమా రఫ్ వెర్షన్ రవితేజ గారి చూపించా. ఆయనకి నచ్చి తెలుగులో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత నేను చేస్తున్న మరో కొత్త సినిమా కూడా ఆయనని చూపించా. అదీ ఆయనకి నచ్చి సినిమాకి సమర్పకులుగా ఉండటానికి అంగీకరించారు. నా సినిమాలు ఆయనకి నచ్చడం ఆనందంగా వుంది. నా సినిమా కాన్సెప్ట్ లు విని ఇలాంటి సినిమాలు చేయాలనీ తనకీ వుందని మెచ్చుకున్నారు” అని చెప్పుకొచ్చాడు విష్ణు విశాల్.
అన్నట్టు రవితేజ ఖిలాడీ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్దమౌతుంది. ఎఫ్ఐఆర్ విడుదల తేది కూడా అదే. తన సినిమా వచ్చిన రోజునే తన సమర్పణలో మరో హీరో సినిమా రిలీజ్ చేస్తున్న రవితేజ సినిమా స్పిరిట్ ని అభినందించాల్సిందే. ఐతే… ఖిలాడి రిలీజ్ ఇప్పుడు డైలమా లో పడిందని ఒక టాక్. ఒక వారం ఆలస్యం గా ఈ సినిమా విడుదల కాబోతోంది అని ప్రచారం జరుగుతోంది. కానీ చిత్ర బృందం మాత్రం… ఇంకా స్పందించలేదు.