రవితేజ కెరీర్ చూస్తే, ఆయన అందుకుంటున్న పారితోషికం గురించి వింటే ఆశ్చర్యమేస్తుంది. హిట్టూ, ఫ్లాపు అనే సంబంధం లేకుండా సినిమాలు చేయడం, సినిమా సినిమాకీ తన పారితోషికం పెంచుకుంటూ వెళ్లడం కేవలం రవితేజకు మాత్రమే సాధ్యమేమో. ఈ నాలుగైదేళ్లలో రవితేజకు `క్రాక్` మినహా మరో హిట్టు లేదు. అయితే తన చేతిలో ఉన్న సినిమాలకు గానీ, అందుకుంటున్న పారితోషికానికి గానీ, ఈ ట్రాక్ రికార్డ్ తో ఏమాత్రం సంబంధం లేదు. రవితేజ చేతిలో 3 సినిమాలున్నాయి. ఇటీవల `ఖిలాడీ`కి గానూ ఆయన దాదాపు 12 నుంచి 15 కోట్ల పారితోషికం అందుకున్నాడని టాక్.
ఇప్పుడు `రామారావు ఆన్ డ్యూటీ` అనే సినిమా పూర్తి చేశాడు రవితేజ. `ఖిలాడీ` చేతిలో ఉండగానే ఈ సినిమా పట్టాలెక్కింది. `ఖిలాడీ`ని కొన్ని రోజుల పాటు పక్కన పెట్టి `రామారావు`పై ఫోకస్ చేశాడు రవితేజ. ఈసినిమాకి గానూ రవితేజకు రోజువారీ పారితోషికం అందిందట. ఒక్క రోజుకి రూ.50 లక్షల చొప్పున రవితేజకు పారితోషికం ఇచ్చారని, 25 రోజుల్లో రవితేజ తాలుకూ సన్నివేశాలన్నీ పూర్తి చేయాలని నిర్మాత భావించాడని, అయితే… ఇప్పటికి 33 రోజుల పాటు షూటింగ్ జరిగిందని, మరో రెండు మూడు రోజుల పాటు ప్యాచ్ వర్క్ మిగిలిఉందని టాక్. అంటే.. ఈ సినిమాతో దాదాపుగా 17 నుంచి 18 కోట్ల వరకూ రవితేజ పారితోషికం అందుకున్నట్టు లెక్క. సినిమాకి ఇంత అని ముందు మాట్లాడేసుకుంటే, కచ్చితంగా 15 కోట్లలోపే పని పూర్తయ్యేది. రోజువారీ ఇద్దామన్న తెలివి తేటలు చూపించడం వల్ల… అదనంగా మరో 3 కోట్లు అయ్యాయి. నిజానికి హీరోగా మారాక తన కెరీర్లో ఎప్పుడూ రోజువారీ పారితోషికం తీసుకోలేదు రవితేజ. అగ్ర హీరోలూ ఇలాంటి సెటప్పులకు దూరం. కానీ… రోజువారీ అందుకోవడం వల్ల రవితేజకు లాభమే జరిగింది.