ఓ సినిమా తీసే ముందు నిర్మాతలకు ఒకటికి పది రకాలుగా ఆలోచిస్తారు. ఆ హీరో గత సినిమా రిజల్టేంటి? ఎంతొచ్చింది? ఎంత పోయింది? అనే లెక్కలు వేసుకునే బడ్జెట్ కేటాయిస్తారు. అయితే.. రవితేజ సినిమాలకు ఇలాంటి లెక్కలుండవు. తన ప్రతీ సినిమాకీ, బడ్జెట్ పెరుగుతూ పోతుంటుంది. తన అదృష్టం కొద్దీ.. తనకూ అలాంటి నిర్మాతలే దొరుకుతుంటారు. రవితేజ `ఖిలాడీ` డిజాస్టర్ అయిపోయింది. అయితే… ఆ ఎఫెక్ట్ ఇప్పుడు `టైగర్ నాగేశ్వరరావు`పై ఏమాత్రం పడలేదు.
రవితేజ కొత్త సినిమా `టైగర్ నాగేశ్వరరావు` ఇటీవలే క్లాప్ కొట్టుకున్న సంగతి తెలిసిందే.వంశీ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా బడ్జెట్ ప్రస్తుతానికి రూ.50 కోట్లు. ఆ తరవాత పరిస్థితుల్ని బట్టి కొంచెం పెరగొచ్చు కూడా. ఖిలాడీకి దాదాపుగా రూ.45 కోట్ల వరకూ పెట్టారు. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎంత తెచ్చుకుందో తెలిసిందే. అయినా సరే.. ఆ ప్రభావం `టైగర్`పై లేదు. ఓ కొత్త దర్శకుడికి సినిమా అప్పగించినా, కథపై నమ్మకంతో నిర్మాతలు కూడా వెనుకంజ వేయడం లేదు. రవితేజ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అందుకే… రవితేజ కెరీర్లోనే ఇది వరకెప్పుడూ లేనంత బడ్జెట్ ఈ సినిమాకి కేటాయించడానికి నిర్మాతలు రెడీ అయిపోయారు. అభిషేక్ సంస్థ నుంచి `కశ్మీర్ ఫైల్స్` అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ ఉత్సాహంతోనే.. `టైగర్`కీ బడ్జెట్ లిమిట్స్ ఎత్తేశారిప్పుడు.