మన కథానాయకులు ఇప్పుడిప్పుడే మూస ధోరణి నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.కథ నచ్చితే… పాత్రకోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఇమేజ్‌ని పక్కన పెట్టి, నాలుగు మెట్లు దిగిరావడానికి కూడారెడీ అంటున్నారు. తాజాగా రవితేజ కూడా ఆ స్థాయిలోనే ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్. మాస్ మహారాజాగా పేరు తెచ్చుకొన్న రవితేజ.. తన కెరీర్లో తొలిసారి ప్రతినాయకుడిగా నటించడానికి సిద్ధమయ్యాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇది గనుక నిజమేతే… అంతకు మించిన షాకింగ్ న్యూస్ మరోటి ఉండదు.
తేజ అహం అనే ఓ కథని సిద్ధం చేసుకొన్నాడు. అందులో ప్రతినాయకుడి పాత్రే కీలకం. ఆ పాత్ర ఓ స్టార్‌తో చేయించాలని కలలుకంటున్నాడు తేజ. రాజశేఖర్ పేరు ఆల్మోస్ట్ ఫిక్సయిపోయింది. కానీ.. తేజ – రాజశేఖర్ లమధ్య మనస్పర్థలు రావడంతో ఈ ప్రాజెక్టు నుంచి రాజశేఖర్ డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు ఆ ప్లేసులో రవితేజని తీసుకొంటే ఎలా ఉంటుందా?? అని తేజ భావిస్తున్నాడట. ఇదే విషయమే తేజ – రవితేజల మధ్య చర్చలు సాగుతున్నాయని, రవితేజ కూడా ఈ పాత్ర పోషించడానికి మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్టయితే.. అదో సంచలనమే.