నేను – శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి.. చిత్రాలతో ఆకట్టుకొన్న దర్శకుడు కిషోర్ తిరుమల. తనదంతా క్లాస్ టచ్. `ఆడాళ్లూ మీకు జోహార్లు` సినిమా తరవాత కిషోర్ కనిపించలేదు. తన అలికిడి అస్సలు వినిపించలేదు. ఎట్టకేలకు మళ్లీ ఓ కథ రెడీ చేసుకొని హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. రవితేజకు కిషోర్ తిరుమల ఓ కథ వినిపించాడని, దాదాపుగా ఇది వర్కవుట్ అయిపోవొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కిషోర్ తిరుమలది.. పూర్తి క్లాస్ టచ్. రవితేజ ఊర మాసు. మరి వీరిద్దరికీ ఎలా కుదిరిందో..? రవితేజకు క్లాస్, మాస్ అనే తేడా ఉండదు. కథ నచ్చితే ఓకే చేసేస్తాడు. పైగా ఈమధ్య కాస్త డిఫరెంట్ గా కనిపించాలన్న తాపత్రయం ఎక్కువైంది.
ప్రస్తుతం `మాస్ జాతర` సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. ఆ తరవాత `మాడ్` దర్శకుడితో ఓ సినిమా చేయాల్సివుంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న సంకల్పంతో ఉన్నాడు రవితేజ. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దాంతో పాటు కిషోర్ తిరుమల సినిమానీ సమాంతరంగా సెట్స్‌పైకి తీసుకెళ్తాడా? లేదంటే 2026 వరకూ కిషోర్ తిరుమల ఆగాలా? అనేది ప్రశ్నార్థకం. రవితేజ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల్ని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఆ లెక్కన.. కిషోర్ తిరుమల సినిమా కూడా తొందర్లోనే పట్టాలెక్కొచ్చు. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి.