రవితేజ పారితోషికం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్. హిట్టూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమా సినిమాకీ పారితోషికం పెంచుకొంటూపోతున్నాడు. రెండేళ్ల క్రితం రవితేజ పారితోషికం రూ.12 నుంచి రూ.15 కోట్లు. ఇప్పుడు అది రూ.30 కోట్లకు చేరింది. రవితేజ – గోపీచంద్ మలినేని సినిమా పారితోషికం సమస్యతోనే ఆగిపోయింది. రవితేజకు రూ.30 కోట్లు ఇవ్వలేమని మైత్రీ మూవీస్ చేతులు ఎత్తేసింది.
పారితోషికం విషయంలో ఏమాత్రం రాజీ పడని రవితేజ.. ఇప్పుడు పారితోషికం లేకుండానే ఓ సినిమా చేసేస్తున్నాడు. అదే.. ‘మిస్టర్ బచ్చర్’. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన `రైడ్` చిత్రానికి ఇది రీమేక్. హరీష్ శంకర్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమాని కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలన్నది టీమ్ నిర్ణయం. పైగా దర్శకుడు, హీరో.. ఇద్దరూ పారితోషికం తీసుకోవడం లేదు. వీళ్లకు లాభాల్లో వాటా దక్కుతుంది. రవితేజకి ఓ సొంత బ్యానర్ ఉంది. సో.. తను కూడా ఓ నిర్మాతే. ఈ కథలో సింహభాగం ఓ పెద్ద సెట్లో జరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పరంగానూ జాగ్రత్తలు తీసుకొంటే కేవలం శాటిలైట్, డిజిటల్ రైట్స్ తోనే టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవొచ్చు. ఆ తరవాత ఎంతొచ్చినా అది బోనసే. రవితేజ ఇలా పారితోషికం విషయంలో కాస్త వెసులుబాటు కల్పిస్తే… నిర్మాతలు హ్యాపీ!