” వీడి లోని ఎనర్జీ అంతా డ్రింక్‌గా మారిస్తే రెడ్ బుల్ మూతపడుతుంది”
– రవితేజ సినిమాలోని ఓ డైలాగ్ ఇది.
అది అక్షరాలా నిజం. కాసేపు నీరసంగా ఫేసు పెట్టిన రవితేజని చూద్దామన్నా చూడలేం. ఒకవేళ రవితేజ అలా కనిపించినా… చూడ్డానికి మనకు మనసొప్పదు. థౌజండ్ వాలాలా… పేలుతూ, తారా జువ్వలా ఎగిసిపడుతూ ఉండే రవితేజ అంటేనే అందరికీ ఇష్టం. తను కూడా అలాంటి పాత్రలే ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు ‘టచ్ చేసి చూడు’లోనూ అంతే జోరు చూపించబోతున్నాడట. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రవితేజతో తెలుగు360.com చిట్ చాట్.
* హాయ్ రవితేజ..
– హాయ్…
* రవితేజ టచ్ చేస్తే ఏమవుతుంది?
– ఏమవుతుందో 2 వ తారీఖు వరకూ ఆగితే తెలిసిపోతుంది.. (నవ్వుతూ)
* ఈ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయి?
– సినిమా బాగా వచ్చిందన్నది అందరి నమ్మకం. బాగానే తీశాం. ఎంత బాగుందో ప్రేక్షకులు చెప్పాలి.
* పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నారు. అందరూ విక్రమార్కుడిని ఊహించుకుని థియేటర్లలోకి అడుగుపెడతారేమో?
– విక్రమార్కుడు విక్రమార్కుడే. టచ్ చేసి చూడు టచ్ చేసి చూడే. ఆ సినిమాకీ దీనికీ పోలిక లేదు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను… టచ్ చేసి చూడు ఎవ్వరినీ నిరుత్సాహపరచదు.
* ప్రతి సినిమాలోనూ మీరే డామినేట్ చేస్తుంటారు. ఈ సినిమాలో మిమ్మల్ని హీరోయిన్లు ఇద్దరూ డామినేట్ చేస్తారట.. నిజమేనా?
– రాశీఖన్నా, శీరత్ కపూర్లకు మంచి పాత్రలు పడ్డాయి. శీరత్ ఫారెన్ నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తుంది. రాశీ పాత్రలో ఫన్ ఉంటుంది. తను చాలా మంచి నటి. తనకు తగిన పాత్రలు ఇప్పటి వరకూ పడలేదంతే.
* రాజా ది గ్రేట్‌లోనూ రాశీ ఖన్నా ఓ పాటలో కనిపించింది.. కారణం మీరేనా?
– నాకు, అనిల్ రావిపూడికీ రాశీ కామన్ ఫ్రెండ్. తను ఓ పాట చేస్తే బాగుంటుందనిపించింది. అడిగితే వెంటనే ఒప్పుకుంది.
* దర్శకుడు విక్రమ్ సిరికొండకు ఇదే తొలి సినిమా. దర్శకుడిగా ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యాడా?
– కథపై క్లారిటీ ఉంటే కన్ప్యూజ్ ఉండదండీ. పైగా దర్శకత్వానికి విక్రమ్ కొత్తేం కాదు. వినాయక్ దగ్గర సహాయకుడిగా పని చేశాడు. క్లియర్ మైండ్ సెట్ తో సెట్లోకి వచ్చేవాడు. నాకు మిరపకాయ్ నుంచీ నాకు పరిచయం ఉంది. నిర్మాత బుజ్జీతో చాలా క్లోజ్. మేమంతా ఓ సినిమా చేద్దామనుకున్నాం. కథ కూడా ఓకే అయ్యింది. కాకపోతే సెట్స్‌పైకి వెళ్లడం కాస్త లేట్ అయ్యింది. ఈలోగా వక్కంతం వంశీ ఈ కథ తీసుకొచ్చాడు. దాన్ని విక్రమ్ తన స్టైల్లోకి మార్చుకున్నాడు.
* మీదగ్గరికి అందరూ వినోదాత్మకమైన కథలనే తీసుకొస్తుంటారు. మీకు అందులో ఛాలెంజ్ ఏమనిపిస్తుంటుంది?
– వినోదం ఒక్కటే కావొచ్చు. కానీ ఎవరి స్టైల్ వాళ్లది. జగన్ సినిమా ఒకలా ఉంటుంది. అనిల్ రావిపూడి సినిమా మరోలా ఉంటుంది. దర్శకుడ్ని బట్టి కామెడీలో స్టైల్ ఉంటుంది.
* కామెడీ పండించడంలో మార్పులేమైనా గమనించారా?
– చాలా మార్పులొచ్చాయి. ఇది వరకు కాస్త లౌడ్‌గా ఉండేది. ఏదో మాయ చేసేవారు. ఇప్పుడు అన్ని విషయాలూ క్లియర్ కట్‌గా ఉండాలి.. కామెడీతో సహా.
* ఈ దారి వదలాలని లేదా?
– వదిలి చాలా సినిమాలు చేశా. నా ఆటోగ్రాఫ్, శంభోశివశంభో.. ఇవన్నీ చాలా మంచి సినిమాలు. కానీ ఏమైంది ? ప్రయోగాలు చేస్తే సినిమాలు పోతున్నాయి.
* ఇక మీదట చేసే అవకాశాలు లేవా?
– ఉన్నాయి. తప్పకుండా చేస్తా. ఈమధ్య ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. ఆటోగ్రాఫ్ ఇప్పుడు తీస్తే సూపర్ హిట్ అవుతుంది. అందుకే నేను కూడా అలాంటి కథలు వింటున్నా.
* మల్టీస్టారర్ చేస్తారా?
– మల్టీస్టారర్ గురించి ఆలోచించాల్సింది నేను కాదు. దర్శకులు, రచయితలు. అలాంటి కథలు చాలా తక్కువగా వస్తున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరవాత ఆ స్థాయిలో మల్టీస్టారర్ ఏమొచ్చింది? నేను హీరోలందరితోనూ బాగుంటాను. కాబట్టి ఎవరితోనైనా సినిమా చేస్తా.
* మీ అబ్బాయిని హీరో చేస్తారా?
– ఇప్పుడే దాని గురించి ఎందుకండీ.. తనకు పదేళ్లే. చాలా సమయం ఉంది. అయినా నేను కావాలని వాడిని సినిమాల్లోకి తీసుకురాలేదు. అనిల్ రావిపూడి అడిగాడని ఓకే చెప్పా.
* తెరపై మీ అబ్బాయి చూస్తే మీకు ఏమనిపించింది?
– నాకంటే బాగా చేశాడనిపించింది
* వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్ల కు అవకాశం ఇచ్చారు. మీ స్నేహితుడి కోసమా?
– అదేం కాదు. ఇక్కడ ఎవరూ ఎవరికీ లైఫ్ ఇవ్వరు. కథ బాగుంటేనే ఓకే చేస్తారు అన్నీ బాగుండాలి… లేదంటే లేదు. శ్రీను వైట్ల చెప్పిన కథ నాకు బాగా నచ్చింది అందుకే ఓకే చేశా.
* బాలీవుడ్‌కి వెళ్లే ఆలోచన ఉందా?
– బాహుబలితో మన మార్కెట్లు పెరిగాయి. వాటిని వాడుకోవాలి. నాకు హిందీ బాగా వచ్చు. మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా. కాకపోతే నేనేదీ ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగను. అన్నీ అలా జరిగిపోవాలంతే
* కల్యాణ్ కృష్ణ సినిమా ఎంత వరకూ వచ్చింది?
– దాదాపు 25 శాతం పూర్తయ్యింది.
* ఓకే.. ఆల్ ది బెస్ట్
– థ్యాంక్యూ వెరీ మచ్