రవితేజ బండి ఎప్పుడూ నాన్ స్టాప్ గా పరుగులు పెడుతూనే ఉంటుంది. ఓ సినిమా పట్టాలపై ఉండగానే, మరో రెండు మూడు కథలు ఓకే చేసేసి, నలుగురు నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసేసుకొనేంత స్పీడు రవితేజ సొంతం. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నారు. అది రవితేజకు 75వ చిత్రం. ఈ సినిమాతోనే సమాంతరంగా మరో ప్రాజెక్ట్ చేయడానికి రవితేజ ఓకే అనేశారని తెలుస్తోంది. తమిళ దర్శకుడు సుందర్ సి.తో ఆయన ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఖుష్బూ ఈ చిత్రానికి నిర్మాత.
సుందర్ సి.కి తమిళనాట మంచి పేరుంది. థ్రిల్లర్ సినిమాలు, కామెడీ టచ్ ఉన్న సినిమాల్ని బాగా హ్యాండిల్ చేస్తారాయన. ఆయన దగ్గర ఓ పవర్ ఫుల్ కథ ఉంది. అది రవితేజకు అయితే బాగుంటుందని, ఆయనతో సినిమా చేయడానికి కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి రెడీ అయ్యిందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే రవితేజ 76వ సినిమా ఇదే అవుతుంది. ఇటీవల రవితేజ చేతికి గాయం అవ్వడంతో ఆయన షూటింగులకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకొంటున్న సంగతి తెలిసిందే. ఆయన కోలుకొన్న తరవాత… సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమాని ముందుగా పట్టాలెక్కిస్తారు. ఆ తరవాత సుందర్ సి. సినిమా ముందుకు వెళ్తుంది. మిగిలిన వివరాలు త్వరలో తెలుస్తాయి.