వరుస ఫ్లాపుల తరవాత రవితేజకు ‘ధమాకా’ రూపంలో ఓ మంచి విజయం వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు ఈమధ్య కాలంలో దక్కిన మంచి విజయాల్లో ఇదొకటి. ఈ సినిమాతో నక్కిన త్రినాథరావుకి మంచి పేరొచ్చింది. సంగీత దర్శకుడిగా భీమ్స్ కి బ్రేక్ దొరికింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనలో ఉంది చిత్రబృందం. దానికి ‘డబుల్ ధమాకా’ అనే పేరు కూడా పెట్టేశారు. స్క్రిప్టు కూడా రెడీగానే ఉందని, త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తామని నక్కిన చెబుతున్నారు.
”రవితేజతో మరో సినిమా చేయాలని వుంది. ఆయన కూడా నాతో ఇదే మాట చెప్పారు. `డబుల్ ధమాకా` కథ కూడా దాదాపుగా రెడీ అయిపోయింది. రవితేజగారు ఎప్పుడు అంటే అప్పుడే ఈ సినిమా మొదలైపోతుంది” అని చెప్పుకొచ్చారు నక్కిన. ఆయన రూపొందించిన `మజాకా` ఈవారమే విడుదల అవుతోంది. ఈ చిత్రానికీ సీక్వెల్ ఉందట. ”రచయిత ప్రసన్నకుమార్ సీక్వెల్ కి తగిన కథ రెడీగా ఉందని చెప్పారు. మాకు కూడా అది నచ్చింది. అయితే సినిమా హిట్టయిన తరవాత దాని గురించి మాట్లాడుకొంటే మంచిది. ముందే… గొప్పలు చెప్పి, ఆ తరవాత చేయకపోతే బాగోదు. అందుకే ఫలితం గురించి నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా” అని చెప్పుకొచ్చారు నక్కిన. త్వరలోనే ఆయన మైత్రీ మూవీస్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నారు. దిల్ రాజు కూడా ఇది వరకే నక్కినకు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే హీరోలు ఎవరన్నది తెలియాల్సివుంది.