రవితేజ సినిమా అంటేనే టెన్ థౌజెండ్ వాలా. సీన్ నెంబర్ వన్ నుంచి ధన్ ధనా ధన్ మోత మోగిపోవాల్సిందే. ఆ ఎనర్జీని చూడ్డానికే థియేటర్లకు వెళ్తారు అభిమానులు. కొంతకాలంగా.. రవితేజ స్టైల్ ఆఫ్ సినిమా బాక్సాఫీసు దగ్గరకు రావడం లేదు. రవితేజ సీరియస్ కథలపై దృష్టి పెట్టడం వల్ల.. ఆ ఎనర్జీని చూడలేకపోతున్నారు అభిమానులు. ఇంతకాలానికి మళ్లీ రవితేజ తనదైన శైలిలో ఓ సినిమా చేశాడు. అదే ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 23న వస్తోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు.
దాదాపు 2 నిమిషాల పాటు సాగిన ట్రైలర్ ఇది. ఫస్ట్ షాట్ నుంచే.. రవితేజ స్టైల్ ఆఫ్ ఎనర్జీ కనిపించింది. ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఆ విషయాన్ని ట్రైలర్లోనే రివీల్ చేసేశారు. స్వామి, ఆనంద్ చక్రవర్తి… అనే రెండు పాత్రల్లో రవితేజ దర్శకమివ్వబోతున్నాడు. స్వామి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న కుర్రాడైతే.. ఆనంద్ చక్రవర్తి.. అపర కోటీశ్వరుడు.
కోట్లలో ఒకడాడు.. కొడతే కోలుకోలేవు… అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.
మనకు కావల్సిన వాళ్లకు చేస్తే.. మోసం.
మనకు కావాలి అనుకొన్న వాళ్లకు చేస్తే న్యాయం.. అనగానే రవితేజ `త్రివిక్రమ్ మీకు చుట్టమా సార్` అని కౌంటర్ ఇవ్వడం బాగుంది. `అమ్మ.. పళ్లు తెమ్మంది..` అంటూ రఘుబాబుతో రవితేజ చెప్పిన డైలాగ్, ఆ టైమింగ్… వింటేజ్ రవితేజని గుర్తు చేసింది.
నేను వెనకున్నవాళ్లని చూసుకొని ముందుకొచ్చినవాడ్ని కాదురోయ్..
వెనక ఎవడూ లేకపోయినా ముందుకు రావొచ్చు.. అనే ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడ్ని.. అంటూ ఈ ట్రైలర్ ముగించారు.
భీమ్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్రీలీల గ్లామర్, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, విజువల్స్… ఇవన్నీ… `ధమాకా` రేంజు పెంచేస్తున్నాయి. చాలా కాలంగా రవితేజకు సరైన హిట్టు పడలేదు. ఈ ట్రైలర్ లో అయితే హిట్టు లక్షణాలు పుష్కలంగా కనిపించేస్తున్నాయి.