రవితేజ కథానాయకుడిగా.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ మండవ దర్శకుడు. ఈనెలాఖరున విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. రవితేజ సినిమా అంటే.. ఫన్, పంచ్లూ, వెరైటీ క్యారెక్టరైజేషన్ ఆశిస్తారు. అయితే.. అందుకు `రామారావు` పూర్తిగా విభిన్నంగా కనిపించాడు. ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ ఉద్యోగిగా నటించారు. “ఇన్నాళ్లూ ఓ గవర్నమెంట్ ఆఫీసర్గా చట్టం కోసం న్యాయం కోసం పనిచేసిన నేను.. ఇప్పుడు రామారావుగా ధర్మం కోసం పనిచేస్తా“ అనే డైలాగ్ తోనే… హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. ఓ ఆపరేషన్లో, అమాయకులైన కష్టజీవులు బలైపోతారు, చాలా మంది ఆచూకీ దొరకదు. అందుకోసం హీరో చేసిన అన్వేషణ ఈ కథ అనిపిస్తోంది. డైలాగులు, మూడ్, టేకింగ్ ఇవన్నీచూస్తుంటే… థ్రిల్లింగ్ ఎలిమెంట్లు ఈ సినిమాలో చాలానే ఉండేట్టు కనిపిస్తున్నాయి. ఈమధ్య వచ్చిన రవితేజ సినిమాల్లో `రామారావు` భిన్నంగా ఉండేట్టే కనిపిస్తోంది. యాక్షన్ సీన్లకు పెద్ద పీట వేశారు. వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తన పాత్ర కూడా కథకు మలుపు కాబోతోంది. నేపథ్య సంగీతం, కెమెరా వర్క్, ఎలివేషన్లూ… అన్నీ నీట్గానే ఉన్నాయి. మరి బాక్సాఫీసు దగ్గర ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.