హిట్ సినిమాలని మళ్ళీ రిలీజ్ చేసే రిరిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. మొదట్లో ఈ ట్రెండ్ కి మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత సమయం సందర్భం లేకుండా కుప్పలు తెప్పలుగా పాత హిట్లన్నీ మళ్ళీ వరసకట్టడంతో అభిమానులు కూడా లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ వ్యవహారం పై పెదవి విరుపులు కనిపించాయి. రీరిలీజ్ మంచిదే కానీ దానికో ప్రత్యేక సమయం కావాలి.. సినిమాలు పెద్దగా లేని వారం చూసుకొని విడుదల చేసుకోవాలి తప్పితే కొత్త సినిమాలు పుష్కలంగా వున్న సందర్భంలో కూడా రీరిలీజ్ లు అవసమా ? అనే అభిప్రాయం వ్యక్తమైయింది.
అయినప్పటికీ ఈ రీరిలీజుల్లో మార్పు రాలేదు. ఇప్పుడు డిసెంబర్ 30న రవితేజ ‘వెంకీ’ సినిమా రిరిలీజ్ కు రెడీ అయ్యింది. దీని కోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేయడం, హీరోయిన్ స్నేహతో స్పెషల్ వీడియో బైట్ ని కూడా విడుదల జరిగిపోయాయి. రవితేజ కెరీర్ లో వెంకీ సినిమా ఓ మైలు రాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాస్ హిట్ అయ్యింది. ఇప్పటకీ ప్రతి వారం ఎదో ఒక టీవీ ఛానల్ లో ఆ సినిమా కనిపిస్తునే వుంటుంది. ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్స్ పై విడుదల చేస్తున్నారు.
అయితే రీ రిలిజ్ కి ఇది సరైన సమయమా ? అంటే కాదనే వినిపిస్తోంది. అభిమానులకు పుష్కలంగా సినిమాలు అందిస్తున్నాడు రవితేజ. ఈ ఏడాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేశాడు. చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో సందడి చేశాడు. మరో రెండో వారాల్లో ‘ఈగల్’ తో వస్తున్నాడు. ఆయన నుంచి బ్రేక్స్ లేకుండా సినిమాలు వస్తున్నాయి. పోనీ బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాలు లేవా?! .. ప్రభాస్ సలార్ అద్భుతంగా ఆడుతోంది. ఈ వారం డెవిల్, బబుల్ గమ్ సినిమాలు వస్తున్నాయి. ఇన్ని సినిమాల మధ్యన కూడా వెంకీ రీరిలీజ్ కి రెడీ అవ్వడం చూసి .. ఈవీవీ సినిమా ఎవడి గోల వాడిది టైటిల్ గుర్తు చేసుకుంటున్నారు జనాలు.