గతమెంతో ఘనకీర్తి ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు.. టీఆర్ఎస్, బీజేపీలకు అలుసైపోయింది. ఒకరు ఎమ్మెల్యేలను, ఓ స్థాయిప్రజాప్రతినిధులను లాక్కుంటున్నారు. మరొకరు.. అంతో ఇంతో బలం ఉన్న నేతల్ని చేర్చేసుకుంటున్నారు. అధికారం అనే అండ ఆ రెండు పార్టీలకు ఉండటంతో ఎదురు లేకుండా పోయింది. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్… కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అడ్రస్ లేకుండా చేసింది.
కాంగ్రెస్‌పై ప్రజల్లో సానుభూతి ఉన్నా … నేతలెందుకు పరారవుతున్నారు..!
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రజల్లో అంత వీక్‌గా ఏమీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలను గెల్చుకుంది. ఆ తర్వాత పది మందికిపైగా ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయినా..స్థానిక సంస్థలకు చెందిన కాంగ్రెస్ క్యాడర్ అంతా గులాబీ కండువాలు వేసుకున్నా… ప్రజల్లో బలం ఏ మాత్రం తేడా రాలేదు. మూడు పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. మరో రెండు సీట్లను చాలా స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో.. గౌరవప్రదమైన స్థానాలను సాధించుకుంది. అధికార పార్టీ … తన పార్టీ క్యాడర్ మొత్తాన్ని కమ్మేసినా.. నిలబడగిలింది. అంటే.. ఆ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లే లెక్క. అయినప్పటికీ… ఆ పార్టీ నాయకులు.. అయితే టీఆర్ఎస్ … లేకపోతే బీజేపీ అని ఎందుకనుకుంటున్నారన్నదే ఆసక్తికరం.
దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్లదీ అదే స్వార్థమా..?
సీఎల్పీ విలీనం అంటే.. చిన్న విషయం కాదు. పార్టీ తరపున గెలిచిన 19 మందిలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి లాంటి వాళ్లను కూడా.. ఆపలేకపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్.. తామే టిక్కెట్ ఇప్పించి.. గెలిపించిన వారిని కూడా పార్టీలో నిలపలేకపోయారు. ఇలాంటివన్నీ.. పార్టీని ఏకతాటిపై నడిపే నేత లేకపోవడం… వాళ్లు వెళ్లిపోతే… తాము బలపడతామనో… తన ప్రత్యర్థులు బలహీనపడతారనో ఆలోచించే నాయకత్వం ఉండటం వల్లే.. సమస్య వస్తోందన్న అభిప్రాయాలు .. కాంగ్రెస్‌లోనే ఉన్నాయి. ఈ కారణాల వల్లే అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ… టీ కాంగ్రెస్‌ను పంచింగ్ బ్యాగ్‌లా వాడుకుంటున్నాయి.
టీఆర్ఎస్ను ఢీకొట్టే నేతకు పగ్గాలిస్తేనే భవిష్యత్..!
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికైనా… సీనియర్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. వారు అలుగుతారని.. వీళ్లు.. వీళ్లు అలుగుతారని.. వాళ్లు.. ఎవరూ పని చేయనివ్వకుండా ఇంత కాలం కాంగ్రెస్ హైకమాండ్ చేసింది. కానీ… ఇప్పుడు పూర్తిగా తీరు మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. టీఆర్ఎస్ ను ఢీకొట్టి ధీటుగా నిలబడే నేతను… పీసీసీ చీఫ్ చేయాల్సి ఉంది. అతనికి పూర్తి స్వేచ్చ ఇచ్చి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ పదవి ఇచ్చినా మరికొంత మంది అలగడం… కాంగ్రెస్ లో సహజం. అలాంటివేమీ పట్టించుకోకుండా.. పోయేవారు పోనీ అనుకుని… అసలైన నేతల్ని పొత్సహిస్తేనే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే.. విలీనం లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.