రవిబాబు కూడా రాంగోపాల్ వర్మ లాంటోడే. తనకూ భలేంటి ఐడియాలు వస్తుంటాయి. రకరకాల పరిస్థితుల్ని తన సినిమాలకు అనుగుణంగా మార్చేసుకుంటాడు. నోట్ల రద్దు సమయంలో, పంది పిల్లను సంకలో పెట్టుకుని ఐటీఎమ్ సెంటర్ ముందు క్యూలో నిలబడి… తన `అదుగో` సినిమా పబ్లిసిటీ మొదలెట్టాడు. ఇప్పుడు కరోనానీ వాడేసుకుంటున్నాడు. తన పోస్టర్లలో మాస్కులతో ముద్దులు పెట్టుకునే హీరో, హీరోయిన్లని చూపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు లాక్ డౌన్ పరిమితుల మధ్య షూటింగ్ మొదలెట్టేశాడు. ఇదిగో హీరో, హీరోయిన్లు కౌగిలించుకునే సన్నివేశం.. అంటూ ఓ వీడియో విడుదల చేశాడు. దూరం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి.. అద్దం మధ్యలో అతుక్కుపోయిన హీరో, హీరోయిన్లని చూపించి, భవిష్యత్తులో – కౌగిలింతలు ఎలా ఉండబోతున్నాయో కళ్ళకు కట్టాడు. రవిబాబు ప్రస్తుతం `క్రష్` అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌కి సంబంధించిన షాట్ అది. సినిమాలో ఈసీన్ ఉంటుందో లేదో గానీ, ప్రస్తుతానికి టైమ్ పాస్ చేస్తోంది. ఈ వీడియో…. సోషల్ మీడియాలో భలే తిరుగుతోంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో మరి. ఇలాంటి తెలివి తేటలు సినిమాల్లోనూ చూపిస్తే.. ఈ ఫ్లాపులు వచ్చి ఉండేవి కావేమో..?