భారత క్రికెట్ లో ఓ ఇన్నింగ్స్ ముగిసింది. ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. నిజానికి అశ్విన్ నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన వెంటనే అశ్విన్ `గుడ్ బై` చెప్పేశాడు. ఈ సిరీస్లో మరో రెండు టెస్ట్లు ఉన్నాయి. అంతలోనే అర్థాంతరంగా రిటైర్ అయిపోవడం అందరికీ షాక్ ఇచ్చేదే. మరీ ముఖ్యంగా అశ్విన్ ఫామ్లో ఉన్నాడు. ఇంకొంతకాలం క్రికెట్ ఆడొచ్చు. అయినా సరే… కఠినమైన నిర్ణయం తీసుకొన్నాడు.
భారత్ చూసిన ఉత్తమ ఆల్ రౌండర్లలో అశ్విన్ ఒకడు. ప్రధానంగా బౌలరే అయినా, జట్టుని కష్టకాలంలో చాలాసార్లు ఆదుకొన్నాడు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లలో తన బ్యాటింగ్ రికార్డు మరింత బాగుంది. ఏకంగా ఆరు సెంచరీలు బాదాడు. టయిల్ ఎండర్లను కాపుకాచుకొంటూ.. ఇన్నింగ్స్ ను నిర్మించేవాడు. భారీ షాట్లు కూడా ఆడగలడు. ఇక బౌలింగ్ సంగతి సరే సరి. ఆఫ్ స్పిన్ తో మాయాజాలం చేస్తాడు. టెస్ట్ మ్యాచ్లలో ముఖ్యంగా స్వదేశంలో అశ్విన్ రికార్డు ఘనంగా ఉంది. ఒకే ఇన్నింగ్స్ లో సెంచరీతో పాటు 5 వికెట్లు, ఒకే సిరీస్లో 250 పరుగులు, 20 వికెట్లు సాధించిన అరుదైన ఘనత అశ్విన్ సొంతం. దీన్ని బట్టి అశ్విన్ ఎంత ఉపయుక్తమైన ఆటగాడో అంచనా వేయొచ్చు.
అశ్విన్ శకం ముగిసింది. మరి ఆ తరవాత ఎవరు? అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అనేది ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్న. ఇప్పుడు జట్టులోకి రాబోయే స్పిన్నర్లకు జడేజా మార్గదర్శనం చేయగలగాలి. అటు బ్యాట్ తో, ఇటు బంతితో అశ్విన్ లోటు తీర్చగలిగేది జడ్డూనే. వాషింగ్టన్ సుందర్ కూడా మంచి బ్యాటరే. ఓ రెగ్యులర్ బ్యాటర్ ఆడగలిగే షాట్లు తాను కొట్టగలడు. ఈమధ్య సుందర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తన స్థానాన్ని సుందర్ భర్తీ చేయగలడు అనే నమ్మకంతోనే అశ్విన్ రిటైర్ అయ్యాడని మాజీలు చెబుతున్నారు. అయితే అశ్విన్ ఇంకొంత కాలం ఆడొచ్చని, ఓ కీలకమైన సిరీస్ నడుస్తుండగా, మధ్యలోనే రిటైర్ అవ్వడం కరెక్ట్ కాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.