అయిదు నెలల విరామం తర్వాత మళ్లీ భారత క్రికెట్ జెర్సీని ధరించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. అదరగొట్టాడు. మోకాలి గాయం నుంచి కోలుకున్న జడ్డూ.. ఈ రోజు ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. తొలి ఇన్నింగ్ లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా స్పిన్ కి ఆసిస్ బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. ఇరవై రెండు ఓవర్లు వేసిన జడేజా 47 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.
మరో స్పిన్నర్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసిస్ తొలి ఇన్నింగ్ లో 177 పరుగులకు పరిమితమైయింది. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నాగ్పుర్వేదిక గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకొంది. రెండో రోజు నుంచే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా మారుతుందనే అభిప్రాయంతో ఆసీస్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తొలి రోజు నుంచే స్పిన్ మాయ కనిపించింది.