సెమీస్‌లో టీమ్ ఇండియా ఓడిపోయింది.
అయితే ఒక్కడు మాత్రం భారత అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు. తనే రవీంద్ర జడేజా. ప్రపంచకప్ కి ఎంపికైనా జడేజాకు ఆడే అవకాశమే రాలేదు. ఇన్నాళ్లూ రిజర్వ్ బెంజ్‌కి పరిమితమైన జడ్డూ… గత రెండు మ్యాచ్‌లలో టీమ్ 11లో చోటు సంపాదించుకోగలిగాడు. సెమీస్‌లో టాప్ ఆర్డర్ చేతులెత్తేసిన వేళ, రోహిత్, రాహుల్, కోహ్లీ.. ఇలాంటి బ్యాటింగ్ వీరులంతా వెనుదిరిగిన వేళ.. ధోనీకి పరుగులు తీయడమే గగనం అనిపిస్తున్న వేళ… బ్యాట్ తో చెలరేగిపోయాడు జడేజా. అచ్చమైన బ్యాట్స్‌మెన్‌లా కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లో 4 ఫోర్లూ, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్ జడేజానే. తను ఉన్నంత సేపూ… స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ధోనీ కూడా జడేజాకే ఎక్కువ స్ట్రైకింగ్ వచ్చేలా చేశాడు. జడ్డూ ఉన్నంత సేపూ.. భారత అభిమానులకు గెలుపుపై నమ్మకం ఉంది.
జడేజా బ్యాటింగ్‌తో అలరించడం ఇదేం కొత్త కాదు. ఇది వరకు కూడా చాలాసార్లు తన బ్యాటు పదును చూపించాడు. అయితే ప్రపంచకప్‌లో, అందులోనూ సెమీ ఫైనల్లో తన బ్యాటింగ్, అభిమానుల్ని అబ్బుర పరిచింది. `జడేజాని నేను ఆల్ రౌండర్‌గా చూడను. తను కేవలం బౌలర్ మాత్రమే` అని ఇటీవల మంజ్రేకర్ వ్యాఖ్యానించడం, దానికి జడేజా కూడా ధీటుగా సమాధానం ఇవ్వడం క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు జడేజా తన బ్యాట్‌తో కూడా సమాధానం ఇవ్వగలిగాడు. టీమ్ ఇండియా ఓడిపోవడం.. భారత అభిమానులకు చేదు వార్తే. కాకపోతే.. జడేజా పోరాటం మాత్రం చిరస్మరణీయం. జడేజా ఆడిన గొప్ప ఇన్నింగ్స్ లలో ఈ మ్యాచ్ అత్యుత్తమ స్థానంలో ఉండిపోతుంది. మ్యాచ్‌కి గెలిపించి ఉంటేనా…, ఆ మజా వేరుగా ఉండేది. కానీ ఏం చేస్తాం? బ్యాడ్ లక్.