ఇల్లంటే ఇల్లు కాదండీ బాబూ… దాన్ని ఇంద్రభవనం, రాజసౌధం అని పిలవలేమో. ఇంగ్లీషులో మాన్షన్ అంటారు కదా… అటువంటిది. అదీ ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్, యాక్ట్రెస్, డాన్సర్, ప్రొడ్యూసర్ జెన్నిఫర్ లోపెజ్ది. అందులో రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (ఎఎఎ) సినిమా షూటింగ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సివియం (మోహన్) నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మంగళవారం జెన్నిఫర్ లోపెజ్ మాన్షన్‌లో మొదలైంది. ఈ విషయాన్ని శ్రీను వైట్ల సోషల్ మీడియాలో పేర్కొన్నారు. “ఎవర్గ్రీన్ ఆఫ్ పాప్, లక్షలాది మంది గుండెచప్పుడు… జెన్నిఫర్ లోపెజ్ వీరాభిమానుల్లో నేనూ ఒకణ్ణి. లాంగ్ ఐలాండ్‌లోని ఆమె మాన్షన్‌లో షూటింగ్ చేస్తున్నా. కలలు నిజం అవుతాయి. మై బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్” అన్నాడు శ్రీనువైట్ల. అందులో షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసిన మల్లారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్నట్టు… సినిమా మొదటి షెడ్యూల్ ఇది. ఇందులో రవితేజ మూడు పాత్రలు చేస్తున్నారు. ఆయన సరసన అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు. మిగతా ఇద్దరూ కేథరిన్ త్రేసా, నివేదా థామస్. ఒకప్పటి హీరోయిన్ లయ, ఆమె కుమార్తె శ్లోక, కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.