వేగం మరో ప్రముఖుడి ప్రాణాలను బలిగొంది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని కొత్వాల్గుడా వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం పాలయ్యారు. ఆయన నడుపుతున్న కారు ఆగి ఉన్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మరణించారు. ఆ సమయంలో కారు 140 కిలోమీటర్ల వేగంతో వెడుతున్నట్లుగా మీటరు సూచిస్తోంది. చలన చిత్రాలలో చిన్నచిన్నపాత్రలలో నటిస్తున్న భరత్ గతంలో ఓ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. వేగం ప్రాణాలు తీససేయడం ఇదే కొత్త కాదు. ఎంతో మంది ప్రముఖులు వేగం కారణంగా అశువులు బాశారు.నెల రోజుల క్రితం ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ హైదరాబాద్‌లోనే వేగంగా వెళుతూ మెట్రో పిల్లర్‌ను ఢీకొని కన్నుమూశారు. అజరుద్దీన్ కుమారుడు, కోమటి వెంకటరెడ్డి కుమారుడు కూడా ఇలాగే వేగానికి బలై పోయారు. వేగ నిరోధానికి ఎన్ని చర్యలు చేపడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. కేవలం అధికారులదే బాధ్యతనుకోకుండా.. వాహనాలు నడిపే వారు సైతం తమ బాధ్యతనెరిగి ప్రవర్తిస్తే.. ప్రమాదాలు తప్పుతాయి.. ప్రాణాలు నిలబడతాయి.