వరుస ఫ్లాపులతో రవితేజ సతమతమవుతున్నాడు. మధ్యలో `రాజా ది గ్రేట్` ఉపశమనం కలిగిందిచా.. దానికి ముందూ తరవాత కూడా పరాజయాలే పలకరించాయి. ‘నేల టికెట్టు’ అయితే వాటికి పరాకాష్ట. ఈ మధ్య కాలంలో ఓ అగ్రశ్రేణి హీరో చేసిన అత్యంత పేలవమైన సినిమా ఇదే అని.. అటు సినీ విమర్శకులూ, ట్రేడ్వర్గాలూ ముక్త కంఠంతో చెబుతున్నాయి. కథల ఎంపికలో రవితేజ జడ్జిమెంట్ ఇన్నిసార్లు బోల్తా కొట్టడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి రవితేజ మైండ్ కథలపై లేదని, తీసుకునే పారితోషికంపైనే ఉందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రవితేజ పారితోషికం ఇప్పుడు ఏకంగా రూ.13 కోట్లని సమాచారం. `నేట టికెట్టు`కి సింగిల్ పేమెంట్ తీసుకున్నాడని, పారితోషికం ఎవరు ఎక్కువ ఇస్తే.. వాళ్లలో సినిమా చేయడానికి రవితేజ సిద్ధమవుతున్నాడని, అంతే తప్ప కథలు వినిపించుకునే పరిస్థితుల్లో లేడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమధ్య ఓ నిర్మాత రవితేజని కలసి సినిమా చేయమని అడిగాడట. ‘రూ.13 కోట్లు సింగిల్ పేమెంట్‌గా ఇస్తే. దర్శకుడు ఎవరైనా ఫర్వాలేదు.. తీసుకురా’ అని చెప్పాడట రవితేజ. రవితేజకు ఆ మొత్తంలో పారితోషికం ఇచ్చుకోలేక, సదరు నిర్మాత యూ టర్న్ తీసుకున్నాడట. కథేంటో కూడా అడక్కుండా, కేవలం పారితోషికాల కోసం సినిమాలు చేస్తే.. ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. ‘నేట టికెట్టు’లాంటి దెబ్బలు ఒకట్రెండు పడితే… అప్పుడు సినిమాలూ ఉండవు, పారితోషికాలూ అందవు. ఈ సత్యం రవితేజ గ్రహిస్తే మంచిది.