పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ని గుర్తుపట్టని ప్రేక్షకులు, సినిమా జనాలు వుంటారా? ఇప్పుడు అయితే వుండరు. ఓ పాతిక సంవత్సరాల క్రితం అయితే? తప్పకుండా వుంటారు. ఎందుకంటే… అప్పుడు ఆయన నటుడు కాదు కదా. చిరంజీవి తమ్ముడు మాత్రమే! మాస్ మహారాజ్ రవితేజ అప్పటికి నటుడు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. ఇదే విషయాన్ని పవన్‌కల్యాణ్ ‘నెల టికెట్టు’ ఆడియో చెప్పారు. రవితేజ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. ఆడియోకి రావడానికి ముఖ్య కారణం రవితేజ అనీ, రవితేజతో సిగ్గు లేకుండా ఎలా నటిస్తారండీ అనేది ఇష్టంతో అడిగాననీ పవన్ చెప్పారు. ‘నెల టికెట్టు’ ఆడియోలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ “నేను నటుడు కాకముందు, మద్రాస్ వీధుల్లో తిరిగే సమయంలో నటుడిగా రవితేజగారిని చూశా. అన్నయ్యగారి తరవాత నేను దగ్గరగా చూసిన నటుడు రవితేజగారే. మద్రాసులో ‘ఆజ్ కా గూండారాజ్’ చూడటానికి థియేటర్‌కి వెళ్ళినప్పుడు తొలిసారి రవితేజగారిని చూడటం జరిగింది. వారికి అది గుర్తు వుంటుందో లేదో తెలియదు గానీ… నాకు గుర్తు వుంది. నేను అప్పుడు నటుణ్ణి కాదు కాబట్టి గుర్తించలేదు. (నవ్వుతూ) నేను మట్టుకు గుర్తించా” అన్నారు. అంతే… ఒక్కసారిగా వేదికపై నవ్వులే నవ్వులు.