రవితేజ సినిమాలంటే హై ఎనర్జీకి ప్రతిరూపాలు. హీరో ఉత్సాహంగా ఉంటాడు. పంచ్లేస్తాడు. నవ్విస్తాడు. హైపర్ యాక్టీవ్ గా ఉంటాడు. అయితే `ఖిలాడీ` టీజర్ చూస్తే… రవితేజ కొత్తగా కనిపిస్తున్నాడు. తన ఆటిట్యూడ్ ఈ సినిమాలో పూర్తిగా మారిపోయింది. హీరో క్యారెక్టరైజేషనే మారిపోయినట్టు కనిపిస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఉగాది సందర్భంగా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రెండు పాత్రల్నీ తెరపై పరిచయం చేసేశారు. అయితే.. ఈసారి రవితేజని ఖైదీగా, కిల్లర్ గా చూపించారు. సుత్తి పట్టుకుని… వరుస హత్యలు చేసే సైకో కిల్లర్ తరహా పాత్రని రవితేజ కోసం డిజైన్ చేశారు. చూస్తుంటే… రవితేజ పాత్రలో నెగిటీవ్ షేడ్స్ ఎక్కువగా కనిపించబోతున్నాయని అర్థమౌతోంది. ఆ హత్యలకు కచ్చితంగా ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండి ఉంటుంది. టీజర్ అంతా థ్రిల్లింగ్ మూడ్లో సాగింది. దేవిశ్రీ ఇచ్చిన ఆర్.ఆర్, విజువల్స్ ప్లస్ పాయింట్ గా మారాయి. ఈ టీజర్లో ఒకే ఒక్క డైలాగ్ వినిపించింది. `యూ ప్లేడ్ స్మార్ట్ వితౌట్ స్టుపిడ్ ఎమోషన్స్… యు ఆర్ అన్ స్టాపబుల్` అనే డైలాగ్ ఒక్కటే ఉంది. దాన్ని బట్టి హీరో క్యారెక్టరైజేషన్ ని అర్థం చేసేసుకోవొచ్చు.