వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు రవితేజ. ఒక్క హిట్టు పడితే… తన కెరీర్ మళ్లీ గాడిన పడుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. `క్రాక్`పై తనకు చాలా నమ్మకాలున్నాయి. మంచి కమర్షియల్ పాయింట్ తో తెరకెక్కిన సినిమా క్రాక్. ట్రైలర్ అదిరిపోయింది. పాటలూ మాస్ కి నచ్చేశాయి. సంక్రాంతికి విడుదల అవుతున్న మొదటి సినిమా. మిగిలిన సినిమాలతో పోలిస్తే… అడ్వాంటేజ్ `క్రాక్`కే ఎక్కువ.
తీరా చూస్తే.. ఈ రోజు విడుదల కావాల్సిన సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. ఇక బొమ్మ పడితే రేపే. అది కూడా గ్యారెంటీ లేదు. సంక్రాంతి సీజన్లో.. తొలి సినిమాగా భారీ వసూళ్లను సొంతం చేసుకుందామనుకున్న `క్రాక్` ఆశలపై నీళ్లు చల్లినట్టే. కారణాలు ఏమైనా కావొచ్చు. అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోవడం మార్కెట్ పరంగా పెద్ద దెబ్బ. సినిమాపై నెగిటీవ్ ఇంప్రెషన్ పడిపోతుంది. రేపు సినిమా విడుదలైనా.. ఫ్లోటింగ్ ఇంతగా ఉండకపోవొచ్చు. అడ్వాన్సు బుకింగుల డబ్బులు ఇప్పుడు వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సినిమాతో గాడిన పడదామనుకున్న రవితేజ… ఆశలన్నీ ఆవిరి అయినట్టే.
ఈ సినిమాకి ఇలాంటి స్పీడ్ బ్రేకర్ పడుతుందని.. ముందు నుంచీ ఊహిస్తూనే ఉన్నారు. ఎందుకంటే `క్రాక్` నిర్మాత ఠాగూర్ మధుకి గత సినిమాల అప్పులు చాలా ఉన్నాయి. రమారమీ 20 కోట్ల వరకూ పాత బాకీలున్నాయి. అవన్నీ సెటిల్ అయితే తప్ప.. తదుపరి సినిమాకి క్లియరెన్స్ దొరకదు. విడుదలకు ముందు ఈ ఇష్యూని క్లియర్ చేసుకుందామని ఆయనా అనుకున్నారు. కానీ.. 20 కోట్ల బాకీలు ఒకేసారి చుట్టుముట్టడంతో.. వాటి నుంచి బయటకు రాలేకపోయారు. శుక్రవారం రాత్రంతా పంచాయితీలు సాగాయి. సగం అప్పులైనా తీరుద్దామన్న ప్రయత్నాలూ ఫలించలేదు. శనివారం మధ్యాహ్నం ఈ వ్యవహారం సెటిల్ అయిపోవాల్సిందే. కానీ… చివరి క్షణంలో ఫైనాన్షియర్లు.. మొండికేయడంతో.. వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. పరిస్థితిని ఇంత వరకూ తీసుకొచ్చిన నిర్మాత విషయంలో రవితేజ కాస్త సీరియస్ గా ఉన్నట్టు వినికిడి. కానీ ఏం చేస్తాం..? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.