రవితేజ అంటే పక్కా ఎంటర్టైన్మెంట్. సరదాగా సాగిపోయే జోవియల్ పాత్రలకు తను కేరాఫ్ అడ్రస్స్. అయితే ఈమధ్య రవితేజ రూటు మార్చాడు. సీరియస్ కథల్ని, పాత్రల్నీ ఎంచుకొంటున్నాడు. దాని వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయన్నది పక్కన పెడితే – రవితేజని కొత్తగా చూసే అవకాశం మాత్రం దక్కుతోంది. ఇప్పుడు ‘రావణాసుర’గా సిద్ధం అవుతున్నాడు రవితేజ. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలోని రవితేజ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. అవన్నీ టీజర్లో కనిపిస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఏప్రిల్ 7న విడుదల అవుతోంది. ఇప్పుడు టీజర్ బయటకు వచ్చింది. 66 సెకన్ల నిడివి ఉన్న టీజర్ ఇది. ఈ సినిమా జోనర్ ఏమిటో, రవితేజ పాత్ర ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు. ఓ క్రిమినల్ గురించి పోలీస్ డిపార్ట్ మెంట్ చేసే వేట ఇది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగింది.
”ప్రతీ క్రిమినల్ వాడు చేసిన క్రైమ్ మీద వాడి సిగ్నేచర్ వదిలి వెళ్లిపోతాడు. లుక్ ఫర్ ద సిగ్నేచర్”
”సీతను తీసుకెళ్లాలంటే దాటితే సరిపోదు.. ఈ రావణాసురిడిని దాటి వెళ్లాలి”
అనే డైలాగులు టీజర్లో వినిపించాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో సుశాంత్ పాత్ర, తన గెటప్ ఆకట్టుకొంటున్నాయి. టీజర్లో తన డైలాగులేమీ బయట పెట్టలేదు కానీ, ఈ సినిమాలో ప్రతినాయకుడు మాత్రం తనే అనిపిస్తోంది. హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన నేపథ్య సంగీతం, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. రావణుడ్ని నెగిటీవ్ క్యారెక్టర్‌గా భావిస్తాం. మరి ఈ సినిమాలో రవితేజ పాత్ర నెగిటీవా? పాజిటీవా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.