ఇండ్రస్ట్రీలో హీరోలకు కరువొచ్చేసిందేమో అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే..! ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కూడా పారితోషికం తగ్గించుకోకపోవడమే అందుకు నిదర్శనం. దానికి తగ్గట్టు నిర్మాతలు కూడా హీరోలు అడిగినంత పారితోషికం ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. నిన్నటికి నిన్న.. ‘టచ్ చేసి చూడు’లో రవితేజ కెరీర్లో మరో అట్టర్ ఫ్లాప్ చేరింది. అంతకు ముందు `రాజా ది గ్రేట్`ని మినహాయిస్తే మాస్ మహారాజాకు వరుస ఫ్లాపులే తగిలాయి. ‘టచ్ చేసి చూడు’లో రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఏమాత్రం బాగోలేదు. రవితేజ ఫేడవుట్ అయిపోతున్నాడేమో అనుకుంటున్న దశ ఇది. అయితే… ఇప్పటికీ రవితేజ తన పారితోషికం విషయంలో కొంచెం కూడా తగ్గడం లేదు.
తాజాగా మైత్రీ మూవీస్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. దీనికి శ్రీనువైట్ల దర్శకుడు. ఆయనేమో ఫ్లాపుల్లో ఉన్నాడు. తన మిత్రుడి కోసం రవితేజ ఈ సినిమా ఒప్పుకున్నాడేమో అనుకున్నారు. కానీ అసలు మేటరు అది కాదు. ఈసినిమా కోసం రవితేజకు రూ.13 కోట్లు పారితోషికం ఇస్తున్నార్ట. టీడీఎస్ అదనం. నిజానికి రవితేజ పారితోషికం రూ.9 కోట్లే. వరుస ఫ్లాపులతో అది కాస్త తగ్గాలి. కాకపోతే రవితేజ తెలివిగా… ‘టచ్ చేసి చూడు’ కంటే ముందు ఈ సినిమాని ఓకే చేసేశాడు. అప్పుడే అడ్వాన్సు కూడా తీసేసుకున్నాడు. మైత్రీ మూవీస్ కూడా ఆ ఎమౌంట్ కి కమిట్ అయిపోయింది. శ్రీనువైట్ల కూడా ‘నా పారితోషికం తగ్గించుకోండి కావాలంటే.. ఈ కథకు రవితేజనే కావాలి’ అని అడిగాడట. దాంతో.. రవితేజ పంట పండింది. కల్యాణ్ కృష్ణతో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. దానికి మాత్రం రూ.9 కోట్లే తీసుకున్నాడని టాక్. మైత్రీ మూవీస్ మాత్రం అడ్డంగా బుక్కయ్యింది.