ఈ సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రం ‘హనుమాన్’. తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇప్పుడు మరో ఆకర్షణ చేరింది. ఈ చిత్రానికి రవితేజ గొంతు తోడయ్యింది.
ఈ సినిమాలో కోటి అనే వానరం పాత్ర ఒకటి ఉంది. సినిమా అంతటా ఈ కోతి పాత్ర ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఈ పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ పాత్ర, రవితేజ గొంతులోని చమత్కారం ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. ఇది వరకు ‘మర్యాద రామన్న’లో సైకిల్ పాత్రకు రవితేజ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. రవితేజ చమత్కారంతో సైకిల్ నుంచి కూడా ఫన్ పండింది. ఇప్పుడు కోటి పాత్రతో… రవితేజ ఇంకెంత వినోదం సృష్టిస్తారో చూడాలి. జనవరి 12న ‘హనుమాన్’ విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. ఇదే సీజన్లో రవితేజ ‘ఈగల్’ కూడా విడుదలకు సిద్ధమైంది.