రవితేజ చేసిన పోలీస్ కథల్లో విక్రమార్కుడు లెవిలే వేరు. అందులో కావల్సినంత మాస్ మసాలా ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఓ రేంజులో ఉంటుంది. ఆ తరవాత రవితేజ కూడా కొన్ని పోలీస్ కథలు చేసినా.. ఆ స్థాయి పాత్ర పడలేదు. ఇంతకాలానికి మళ్లీ రవితేజని విక్రమార్కుడు పూనినట్టు అనిపించాడు.. క్రాక్ టీజర్ చూసినప్పుడు.
రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. శ్రుతిహాసన్ కథానాయిక. మహాశివరాత్రి సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. టీజర్లో రవితేజ వీర విహారం కనిపించింది. లుక్ పరంగా చూస్తే అచ్చుగుద్దినట్టు విక్రమ్ రాథోడ్లా ఉన్నాడు. ఒరేయ్ అప్పిగా, సుబ్బిగా.. అంటూ చెప్పిన డైలాగులో రవితేజ మాస్తనం ఏమిటో మరోసారి అర్థమైంది. గ్లామర్ కూడా కావల్సినంత ఉందన్న విషయం టీజర్లోనే చెప్పాశారు. శ్రుతిహాసన్ తన కాలితో రవితేజ మీసం మెలేసే షాట్ హైలెట్ అనుకోవాలి. యాక్షన్ విజువల్స్.. తప్పకుండా మెప్పించేలా ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతం మరింత కిక్ ఇచ్చింది. మొత్తానికి రవితేజ సినిమాకి ఇన్నాళ్లకు హిట్ కళ కనిపిస్తోంది. ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో.