వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి ఎన్నికల షెడ్యూల్ జారీ అవడంతో తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలలో హడావుడి మొదలయింది. మిత్రపక్షాలుగా ఉన్న తెదేపా, బీజేపీలు ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యేక రెండు పార్టీలలో అభ్యర్ధులు తమకే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండటంతో సమస్య మొదలయింది.
తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. తమ పార్టీలో కార్యకర్తలు తననే వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేయమని కోరుతున్నారని కనుక తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసారు. మెదక్ ఉప ఎన్నికలలో, ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది కనుక మిత్రధర్మం పాటించి ఈ సీటుని తనకే వదిలిపెట్టాలని ఆయన బీజేపీని కోరుతున్నారు. ప్రజలలో తెరాసపై నమ్మకం, ఆశలు సన్నగిల్లాయని, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని రావుల చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి తరుణంలో తనకు అవకాశం కల్పించినట్లయితే ఈ ఎన్నికలలో తప్పకుండా విజయం సాధించగలనని అన్నారు. అయితే బీజేపీ నేతలు కూడా తమ పార్టీ తరపున ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టాలనే విషయంపై చర్చించేందుకు ఈరోజు సమావేశమయ్యారు. అనంతరం వారు తెదేపా నేతలతో సమావేశమయ్యి చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకొంటారు. ఆ రెండు పార్టీలు మాట్లాడుకొని రేపు తమ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది.