కడప జిల్లా రాయచోటిలో ప్రతీ రోజూ ఆందోళనలు జరుగుతున్నాయి. అమరావతి ఆందోళనలతో… రాయచోటి గురించి ఎవరూ పట్టించుకోవడం కానీ… అక్కడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందరూ కలిసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై.. మండి పడుతున్నారు. దీనికి కారణం.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు కేటాయించడం. ఎన్నో అభ్యంతరాలున్నా… ఈ స్థలాన్ని కేటాయించడానికి శ్రీకాంత్ రెడ్డి.. బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డారు. చివరికి కేబినెట్లోనూ ఆమోదముద్ర వేసుకొచ్చారు. దీంతో.. అక్కడి ప్రజలు.. రగిలిపోతున్నారు.
రాయచోటి నడిబొడ్డునున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వందేళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ హయాంలో దీన్ని ప్రారంభించారు. ఆ కాలేజీ మైదానం విశాలంగా ఉంటుంది. రాజకీయ పార్టీలు బహిరంగసభలకు ఈ మైదానాన్నే వాడుకుంటాయి. అయితే.. ఈ స్థలంపై.. చాలా మంది కన్నుపడింది. ఓట్ల కోసం.. ఆ స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు ఇప్పిస్తామని.. శ్రీకాంత్ రెడ్డి.. ప్రతీ ఎన్నిక సమయంలోనూ చెబుతున్నారు. ఇప్పటికి మూడు సార్లు గెలిచిన శ్రీకాంత్ రెడ్డి.. మూడు సార్లు హామీ ఇచ్చారు. ఇప్పుడు జగన్ సీఎం కావడంతో.. ఆయన ఫైల్‌ను ముందుకు కదిలించారు. నిజానికి ఆ స్థలంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని.. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. 2015లో స్థలాన్ని పరిరక్షిస్తూ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ.. కోర్టు తర్వాత కొట్టివేసినా పర్వాలేదని.. తాము హామీని నెరవేర్చుకున్నట్లుగా ఉంటుందన్న ఉద్దేశంతో మంత్రివర్గంలోనే … నిర్ణయం తీసుకున్నారు.
ఈ స్థలం వక్ఫ్ బోర్డుకు కేటాయించడంపై అక్కడి ప్రజలు భగ్గునమ్మారు. బీజేపీ ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుంది. ఈ వ్యవహారంపై కన్నా లక్ష్మినారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాయచోటిలో రోజుకో బీజేపీ నేత పర్యటించి… ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు. కోర్టు తీర్పు ఉల్లంఘించి మరీ స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు కేటాయించడంతో జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేపై కోర్టు ధిక్కరణ కేసు వేసేందుకు ప్రజాసంఘాలు సిద్ధమయ్యాయి. కళాశాల స్థలాన్ని వెంటనే కాలేజీ కమిటీకి అప్పగించాలని… లేకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని అన్ని పార్టీలు హెచ్చరిస్తున్నారు. ఆ స్థలం విలువ రూ. 350కోట్లకుపైగా ఉంటుందని అంచనా.