సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు జీవో ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు కారణంగా వచ్చిన వివాదాల విషయంలోనూ అంతే పట్టుదల ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ అని.. నిలిపివేయాలని తెలంగాణ కృష్ణాబోర్డుకు ఫిర్యాదుకు చేసింది. విభజన చట్టం ప్రకారం.. కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలి. తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదు ప్రదాన అజెండాగా.. గురువారం కృష్ణాబోర్డు సమావేశం కాబోతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనను సమర్థంగా వినిపించి.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి తీసుకు వస్తుందని.. ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.
సంగమేశ్వరం దగ్గర ఎత్తిపోతల నిర్మిస్తే.. రోజుకు మూడు టీఎంసీల నీటిని సీమకు తరలించవచ్చు. చాలా వరకు రాయలసీమ నీటి కష్టాలను తీర్చవచ్చు. అందుకే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. పాలనా అనుమతులు మంజూరు చేసింది. కానీ.. రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయడంతో వివాదాస్పదం అయింది. సైలెంట్‌గా టెండర్లు అన్నీ పూర్తి చేసేస్తే.. సరిపోయేది కానీ.. టెండర్లు పిలువక ముందే వివాదాస్పదం కావడంతో… ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పటికే ఎన్జీటీ స్టే ఇచ్చింది. ఇప్పుడు.. కృష్ణాబోర్డులో చర్చించాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహహన్ రెడ్డి వివిధ సందర్భాల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరాన్ని నొక్కి చెప్పారు. తెలంగాణకు చుక్క నీటి నష్టం ఉండదని.. తమ వాటా మేరకే వాడుకుంటామని.. స్పష్టం చేస్తున్నారు.
సీఎం జగన్‌కు.. రాయలసీమ ఎత్తిపోతలపై ఉన్న క్లారిటీని… అధికారులు కృష్ణాబోర్డు ముందు ఉంచాల్సి ఉంది. తెలంగాణకు నష్టం జరగదని.. నిరూపించి.. అభ్యంతరాల్లేకుండా చూసుకుని.. నీటి తరలింపునకు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయంలో ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌తో తమకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై రాయలసీమ వాసులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రభుత్వం వివాదాల్లేకుండా పరిష్కరించి తమకు నీళ్లు ఇస్తుందని ఆశిస్తున్నారు.