రాయలసీమలో పార్టీ ఫిరాయించిన తెలుగుదేసం పార్టీ నేతలు ఇప్పుడు మళ్లీ తాము సొంత గూటికి వస్తామని కబురు పంపుతున్నారు. పులివెందుల నియోజకవర్గానికి చాలా కాలంగా టీడీపీ తరపున ఇంచార్జిగా ఉండి.. గత ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్సీగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా చక్రం తిప్పిన సతీష్ రెడ్డి కొన్నాళ్ల క్రితం వైసీపీలో చేరిపోయారు. అప్పట్నుంచి ఆయన ఫేడవుట్ అయిపోయారు. ఎక్కడున్నారో తెలియడంలేదు. వైసీపీ వాళ్లు పట్టించుకోవడం లేదు. దీంతో ఆయన మళ్లీ టీడీపీలోకి వస్తానని కబురు చేస్తున్నారు. కానీ చంద్రబాబు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో బీటెక్ రవినే జగన్మోహన్ రెడ్డిపై పోటీచేస్తారని.. ఎవరు మళ్లీ పార్టీలోకి వచ్చినా పార్టీ కోసం పని చేయాల్సిందేనని కడప నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు.
గత ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం తర్వాత కడప, అనంతపురంతో పాటు పలువురు కీలక నియోజకవర్గాల నేతలు రక్షణ కోసం పార్టీ మారిపోయారు. కొంత మంది వైసీపీలో మరికొంత మంది బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు ఎన్నికల మూడ్ రావడం.. సీఎం జగన్ ముందస్తుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతూండటంతో మళ్లీ అందరూ సర్దుకుంటున్నారు. తాము పార్టీలోకి వస్తామని కబురు పంపుతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ సహా జమ్మలమడుగు నేతలు.. ఇతర కీలక నేతలుఅదే పనిలో ఉన్నారు. కానీ ఎవరికీ చంద్రబాబు సీటు గ్యారంటీ ఇవ్వడం లేదు.
ఒక్క రాయలసీమ నేతలే కాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కొంతమంది వెనక్కి వచ్చే ఆలోచన చేస్తున్నారు. కొంత మంది పార్టీ మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని కామ్‌గానే ఉన్నారు. కానీ కొంత మంది అతి ప్రవర్తనకు దిగారు. ఈ కారణంగా అలాంటివారికి రీ ఎంట్రీ ఉండే అవకాశం లేదు. ఇతరులను పార్టీలో చేర్చుకున్న వారికి టిక్కెట్లు ఇవ్వడం లాంటి పనులు చేయరన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొసమెరుపేమిటంటే కొంత మంది వైసీపీ నేతలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు.