రాయలసీమకు ఎయిర్ కనెక్టివిటీ విస్త్రతం అయింది. దాదాపుగా ప్రతీ జిల్లాకు… విమాన ప్రయాణ సౌకర్యం ఏర్పడుతోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం జాతికి అంకితం అవుతోంది. కర్నూలుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్లు సమీపాన రాతికొండల్లో ఏయిర్ పోర్టు నిర్మాణం చేపట్టారు. ప్రతిపాదనలు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ.. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓర్వకల్లు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు వేశారు. విదేశీ సంస్థలకు అక్కడి భూములు చూపించి కొన్ని పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో 2017 జూన్ లో విమానాశ్రయానికి చంద్రబాబు శంకుస్ధాపన చేశారు. శరవేగంగా పూర్తి చేశారు. గత నెలలోనే ట్రయల్ రన్ విజయవంతమయింది.
రన్ వే , అప్రాన్, టర్మినల్, టవర్ భవనం, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ను 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దాదాపు 85 మంది ప్రయాణించే ఏటిఆర్ -760 విమానాలు ఓకేసారి 4 పార్కింగ్ చేసుకోగలిగేలా టెర్మినల్ కు ఎదురుగా ఆప్రాన్ నిర్మించారు. తొలి విడతగా కర్నూలు విమానాశ్రయం నుంచి గన్న వరం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఏయిర్ పోర్టులకు డొమెస్టిక్ విమానాలు నడపవచ్చని అధికారులు చెప్తున్నారు. విమానాశ్రయం ఏర్పాటు ద్వారా విదేశీ పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టే దిశగా ఆకర్షించడానికి ఓ పెద్ద ముందడుగు పడిందని అనుకోవచ్చు.
ఎయిర్ పోర్టు సమీపంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ ఏర్పాటయింది. మరికొన్ని ప్రముఖ కంపెనీలకు భూమిపూజ చేశారు. కర్నూలు జిల్లా వాసులకు రవాణా సౌలభ్యం సులభతరం కానుంది. ఇప్పటికే అనంతపురం వాసులకు… అత్యంత చేరువగా… బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ ఉంది. అలాగే.. తిరుపతిలో .. కడపలో కూడా విమాశ్రయాలు నడుస్తున్నాయి. కుప్పంలోనూ.. ఓ ఎయిర్ స్ట్రిప్ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపనచేశారు.