ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే జిల్లాల పర్యటన ప్రారంభించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఆమె కండువా కప్పించుకున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున మంగళగిరి నుంచి పోటీ చేయడం ఖాయమే అనుకోవచ్చు. కాంగ్రెస్ లోకి రావాలని వైసీపీలో పెద్దగా ప్రాధాన్యత లభించని కీలక నేతలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎ
న్నికల్లో సీట్ల ఖరారును బట్టి కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అందుకే ఆయా పార్టీల్లో చేరినా పోటీ చేసే అవకాశం లభించదు. బీజేపీకి పెద్దగా బలం లేదనందున ఆ పార్టీలో చేరలేదు. ఇక ఆప్షన్ ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నిజానికి షర్మిల ఆ పార్టీలో చేరే వరకూ ఎవరూ పట్టించుకోలేదు. నీ షర్మిల చేరిన తర్వాత కొంత మంది ఆ పార్టీని ఓ ఆప్షన్ గా పెట్టుకున్నారు. దీంతో ఎక్కువగా చేరికలు ఉంటాయన్న ప్రచారం ఊపందుకుంటోంది.
రాయలసీమకు చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎంపీ టిక్కెట్ కేటాయించారు. తన వారసుడు గుమ్మనూరు ఈశ్వర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని జయరాం చెబుతున్నారు. ఆయన కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమైన నేతలకు సన్నిహితుడు. దీంతో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీలో కీలక నేతగా ఉన్న రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పెద్దగా కనిపించడం లేదు. ఆయనకు కూడా టిక్కెట్ నిరాకరిస్తారన్న ప్రచారం జరుగుతూండటంతో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో పది మంది ఎమ్మెల్యేల వరకూ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారని.. రాబోయే రోజుల్లో రాయలసీమలో చేరికలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా పోటీకి ఓ ఆప్షన్ ఉండటంతో అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీలో కూడా సీటు రాని నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి మెరుగు పడిందన్న అభిప్రాయంతో కొంత మంది ఉన్నారు.