మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవేశపడ్డారు. కమ్మ సామాజికవర్గంపై జగన్ కక్ష సాధిస్తున్నాడని మండిపడ్డారు. తన ఆగ్రహాన్ని మీడియాకు తెలిసేలా చేసుకున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. తన కోపంలో ఆయన.. కమ్మవారు తల్చుకుంటే.. ఏమైనా చేయగలరన్నట్లుగా మాట్లాడటంతో వైసీపీ సోషల్ మీడియా టీం యాక్టివ్ అయింది. కారణం ఏమిటో తెలియదు కానీ.. రాయపాటి సాంబశివరావు బుధవారం.. జగన్ సర్కార్ పై ఫైరయ్యారు. జగన్ పాలన గుడ్డి ఎద్దు చేలో పడినట్లుగా ఉందని .. ప్రతి విషయంలో కమ్మ, కమ్మ అంటూ గోల చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో రెడ్డి కులం వారికే పోస్టింగులు ఇస్తున్నారని.. కమ్మ అని తెలిస్తే తీసి పక్కన పడేస్తున్నారు, ఇది మంచిది కాదన్నారు. కమ్మ వారు ఏం చేస్తారులే అనుకోవద్దని హెచ్చరించారు.
ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌ను మార్చడం మంచిది కాదన్నారు. కరోనా తగ్గిన తర్వాత అమరావతి విషయంపై ప్రధానితో మాట్లాడతానని.. రాజధాని మార్పుతో వైసీపీ జీరో అవుతుందని తేల్చేశారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. రాయపాటి చేసిన సామాజికపర విమర్శలపై..సోషల్ మీడియా లో వైసీపీ ఫ్యాన్స్ రెచ్చిపోవడం ప్రారంచారు. జగన్ ను హెచ్చరించినట్లుగా ఉండటంతో.. పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ తో పాటు.. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. దీంతో రాయపాటి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. జగన్‌పై తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్ధం చేసుకుందని .. సీఎంగా అన్ని కులాలను కలుపుకుపోవాలని చెప్పానని చెప్పుకొచ్చారు. కమ్మవారిపై ద్వేషం మంచిది కాదని సీనియర్ రాజకీయ నేతగా సలహా ఇచ్చానని .. జగన్‌పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో కమ్మ కులస్తుల పట్ల జరుగుతున్న వివక్షపైనే నేను మాట్లాడాను .. కమ్మవాళ్లు తలచుకుంటే జగన్ రెడ్డి లేచిపోతాడని తాను వ్యాఖ్యానించలేదని వివరణ ఇచ్చారు. సీఎం స్థాయి వ్యక్తి తరచూ కులాల ప్రస్తావన తేవడం నన్ను బాధించిందన్నారు. రాయపాటి సాంబశివరావు హఠాత్తుగా.. జగన్ ఎత్తుకున్న కమ్మ వ్యతిరేక అజెండాను ఎందుకు హైలెట్ చేయాలనుకున్నారో కానీ.. ఆ విషయంలో సక్సెస్ అయినట్లుగానే ఉంది. మరి దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందా..? యాధృచ్చికంగా అన్నారా అన్నది రాజకీయ లెక్కల ప్రకారం బయటకు రాదు.