ఎంత లేదన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజిక వర్గం వారికి చెందినది అనే అభిప్రాయం అప్పుడూ ఇప్పుడూ ఉందీ.. ఉంటుంది! అందరూ మాకు సమానం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా… కొందరు కొంత ఎక్కువ సమానం అనేది అడుగడుగునా అర్థమౌతూ ఉంటుంది! అయితే, ఇప్పుడీ ఇమేజ్ చట్రం నుంచి టీడీపీ బయటకి రావాల్సిన పరిస్థితి ఆంధ్రాలో ఏర్పడింది. ఎందుకంటే, కాపు సామాజిక వర్గం నెమ్మదిగా సంఘటితం అవుతోంది. ప్రస్తుతానికి వారికీ ఓ బలమైన నాయకుడు కనిపిస్తున్నాడు..! ఆ నాయకుడికి కులముద్ర ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఆ సామాజిక వర్గ ప్రజలు మాత్రం అతడికి ఆ కోణం నుంచే దగ్గరౌతున్నారు. ఇంకోపక్క.. రెడ్డి సామాజిక వర్గం ఏ పార్టీవైపు మొగ్గు చూపుతుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు! ఈ తరుణంలో తమపై ఉన్న కమ్మ ముద్రను తుడుచుకోవడం కోసం ఓ కొత్త ఎత్తుగడ వేస్తున్నట్టున్నారు సీఎం చంద్రబాబు!
గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రాయపాటి సాంబశివరావు. కమ్మ కులాన్ని చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం మానేశారన్నారు! తన పీఠాన్ని రక్షించుకోవడం కోసం మరో కులానికి (?) మద్దతుగా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీలో కమ్మ నాయకులు ఉన్నా, వారు బాబును ప్రశ్నించే పరిస్థితి లేదని, ఓట్ల కోసం పదవి కోసం ఒక సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు బాలేదని రాయపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాయపాటి విమర్శలు ఆసక్తికరంగా ఉన్నాయి! ఎందుకంటే, ఆయన మాట్లాడింది కూడా కమ్మ జన సేవా సమితి కార్యక్రమంలో కావడం విశేషం. అయితే, నిజంగానే చంద్రబాబు ఆ సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదా అనే అనుమానం కలిగేలా రాయపాటి మాట్లాడారు. లేదంటే, ఈ అనుమానం ప్రజల్లో కలగాలన్న ఉద్దేశంతోనే రాయపాటి ద్వారా చంద్రబాబే ఇలా మాట్లాడించి ఉంటారా అనేది కూడా అనుమానమే! అదే మాట చంద్రబాబు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ‘మాకు అందరూ సమానమే’ అని ఏ ఇతర నేత చెప్పినా కూడా ఆ సౌండింగ్ ఆలోపించజేసేలా ఉండదు. అదే, ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలే విమర్శిస్తే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా!
రాయపాటి విమర్శలు వింటుంటే నిజమేనేమో అనిపించేలా ఉన్నాయి. రాయపాటి పాయింటాఫ్ వ్యూ నుంచి చూస్తే… కొన్ని సంస్థలకు చంద్రబాబు ప్రోత్సాహం ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువ ఉంటోందన్న అక్కసుతో ఆయన ఇలా వ్యాఖ్యానించి ఉండొచ్చు! స్వామి కార్యాన్నే స్వకార్యంగా చేస్తున్నారా… స్వకార్యంలో స్వామికార్యాన్ని చొప్పించారా అనేది ఆయనకే తెలియాలి! ఏదైమైనా, ముందస్తు అనుమతి లేకుండా ఇలాంటి సున్నితాంశాలపై టీడీపీ నేతలు మాట్లాడేంత స్వేచ్ఛ ఉంటుందంటే నమ్మలేం కదా!