మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు.. బీజేపీతో బేరం కుదిరినట్లుగా లేదు. ఆయన ఇప్పుడు వైసీపీపై దృష్టి సారించారు. జగన్మోహన్ రెడ్డి పాలన అత్యంత ఘోరంగా ఉందని.. తెలుగుదేశం పార్టీ.. రెండు నెలల్లోనే ప్రజాపోరాటాలకు శ్రీకారం చుట్టిన సమయంలోనే.. ఆయన వైఎస్ జగన్ పాలన బాగుందని.. సర్టిఫికెట్ జారీ చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ను సమర్థించడానికి… రాయపాటి.. కేంద్రంపై కూడా విమర్శలు చేశారు. జగన్ మంచిగా పరిపాలిస్తున్నా.. కేంద్రం నుంచి మాత్రం సహకారం అందడం లేదని చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీలో చేరుతాననేది త్వరలో ప్రకటిస్తానన్నారు. అంటే.. ఆయన తెలుగుదేశం పార్టీకి దూరం కావాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని అర్థం చేసుకోవచ్చు.
గతంలో… రామ్ మాధవ్ ఇంటికి వచ్చి మరీ పిలవడంతో… బీజేపీలో చేరేందుకు ఆయన రెడీ అయిపోయారు. కానీ.. ఆయన ఆశించిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో మాత్రం.. బీజేపీ నుంచి.. పెద్దగా స్పందన రాలేదన్న ప్రచారం జరుగుతోంది. పైగా… తాను ఒక్కడ్నే బీజేపీలో చేరుతానని..కుటుంబసభ్యులంతా.. రాజకీయ భవిష్యత్ ఉండే పార్టీలో చేరుతారన్నట్లుగా.. ఆయన మాట్లాడటంతో.. బీజేపీ నేతలు రాయపాటిని లైట్ తీసుకున్నారు. అదే సమయంలో.. ఆయన రాజకీయ శత్రువు కన్నా… ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వైపు నుంచీ అడ్డంకులు ఎదురయినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఇప్పటికిప్పుడు.. తన సమస్యలకు బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చే పార్టీ కోసం.. రాయపాటి ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేయాలని… ఏపీ సర్కార్ నిర్ణయించిన నేపధ్యంలో… రాయపాటి వ్యాఖ్యలు ఆసక్తి కలిగించేవే. ఆయన వైసీపీ వైపే మొగ్గుచూపుతున్నారని..తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. అయితే.. టీడీపీ నేతలు మాత్రం.. ఆయనను సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదంటున్నారు.