✍ ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారా? పార్టీ కోసం పని చేసిన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారా? పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉందా? తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి.
? గుంటూరు కమ్మజనసేవా సమితిలో జరిగిన కుల సమావేశానికి హాజరైన ఎంపీ రాయపాటి. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు కమ్మకులాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. పార్టీని నిలబెట్టే వారిని, పార్టీ కోసం పనిచేసే వారిని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని రాయపాటి విమర్శించారు. ఓట్లు, పదవి కోసం బాబు ఓ కులానికి కొమ్ము కాస్తున్నారని రాయపాటి పేర్కొన్నారు. టీడీపీలో స్వేచ్చగా మాట్లాడే అవకాశం ఉండదన్న రాయపాటి.. టీడీపీలో తాను జూనియర్ నేతనని, అందువల్ల తాను పెద్దగా ప్రశ్నించలేకపోతున్నానని వివరించారు. పార్టీలోని సీనియర్ కమ్మ నేతలు సైతం చంద్రబాబును ప్రశ్నించే అవకాశం లేకపోవడం దురదృష్టకరమన్నారాయన.
గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కమ్మ సామాజికవర్గం అంతా కలిసి పని చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా రాయపాటి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కమ్మ వారిని ముఖ్యమంత్రి చిన్నచూపు చూడటం బాధాకరమన్నారు. ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న అభిప్రాయం కలగడం మంచిది కాదని, చంద్రబాబు ప్రస్తుత వైఖరే కొనసాగిస్తే పార్టీ ఉనికికి ప్రమాదం వస్తుందని రాయపాటి హెచ్చరించారు. గ్రామస్థాయి కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారన్న రాయపాటి.. ఇది పార్టీకి మనుగడకు మంచిది కాదని చెప్పారు. ఇక రిటైర్డ్ ఐఎఎస్ లకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది కూడా మంచిది కాదని రాయపాటి అభిప్రాయపడ్డారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని రాయపాటి స్పష్టం చేశారు.
? అయితే రాయపాటి వ్యాఖ్యల్లో నిజం లేదని కమ్మ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నాయకులు అంటున్నారు. కేబినెట్ తో పాటు యంత్రాంగంలో కీలక పదవులను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇచ్చారనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఆ విషయం మరిచిపోయి చంద్రబాబును ఇలా విమర్శించడం సరికాదని రాయపాటిపై కొందరు కమ్మ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా రాయపాటి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో హాట్ టాపిక్ గా మారాయి.