రజాకార్ సినిమా ట్రైలర్ విడుదల అయింది . ట్రైలర్ చూసిన చాలా మంది రెండు రకాలుగా విడిపోయారు. ఒకరు మత విద్వేషాలను పెంచే ప్రయత్నమని విమర్శలు చేస్తూండగా.. నిజాలు చెబితే తప్పేమిటని మరొకరు వాదిస్తున్నారు. ఈ సినిమా వివాదంలోకి రాజకీయాలు కూడా వచ్చాయి. అసలు రాజకీయాల కోసమే ఈ సినిమా తీశారు. ఇక రాజకీయం కాకుండా ఎలా ఉంటుంది. చరిత్ర తెలియని మూర్ఖులు మత విద్వేషాల కోసం ఈ సినిమా తీశారని.. తాము అడ్డుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. దాంతో బీఆర్ఎస్ నేతలంతా విరుచుకుపడుతున్నారు. సహజంగానే బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నిజాలు చెబితే మీకేమి నొప్పి అని ప్రశ్నిస్తున్నారు.
రాజాకార్ సినిమా ఖచ్చితంగా వివాదాస్పదమే. ఎందుకంటే ఈ సినిమా కశ్మీర్ ఫైల్స్.. కేరళ ఫైల్స్ తరహాలో ఉంటుంది. బీజేపీ నేత గూడూరు నారాయణరావు సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టుగా సినిమా వర్గాలు చెబుతున్నాయి. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో పారామిలిటరీ వలంటీర్ దళాన్ని రజాకార్లుగా పిలుస్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఖాసిం రజ్వీ నాయకత్వంలో వీరి విస్తరణ జరిగింది. హైదరాబాదులో ముస్లింల పాలనను కొనసాగించడానికి, భారత్లో విలీనానికి వ్యతిరేకంగా వీరి ప్రతిఘటించి పోరాటం చేశారు. అయితే.. అప్పట్లో వారు హిందువులతో పాటు ముస్లింలను కూడా టార్గెట్ చేసుకుని దాడులు చేశారని చెబుతారు. అయితే ట్రైలర్ మొత్తం హిందువుల్ని .. రజాకార్లు ఊత కోచ కోస్తున్నట్లుగా ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీన్లు ఉన్నాయి. ఇదే వివాదం అవుతుంది.
‘ది కాశ్మీర్ ఫైల్స్’ ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాల్లో ఓ వర్గాన్ని ఓ బూచిగా, టెర్రరిస్టులుగా చిత్రీకరించారనే విమర్శులు వెల్లువెత్తాయి. ఇప్పుడు తెలంగాణలో రజాకార్లపై తీసిన సినిమాలోనూ అట్లాంటి మరో ప్రయత్నమే చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైందని, పోరాటాల్లో ఆరితేరిన వారు కాబట్టి మంచి ఏది, చెడు ఏదన్న విషయాలను ఈజీగా గుర్తించగలరని ..రాజకీయాల కోసం తప్పుడు సినిమాలు తీస్తే ఊరుకోరని అంటున్నారు. ఈ సినిమాకు తెరవెనుక రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.