రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… దీనిపై భారతీయులకు అపార నమ్మకం ఉండేదని చెప్పుకోవాల్సి వస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత ఆర్బీఐ అభాసుపాలు కావాల్సి వస్తోంది. బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంతగా విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు లేవనే చెప్పాలి. పెద్ద నోట్ల రద్దుతో భాజపా సర్కారు ఏం సాధించింది అనేది ఇంకా తేలాల్సి ఉంది! కొండను తవ్వినా చిట్టెలుకలు కూడా దొరికినట్టు లేదు. కానీ, దున్నపోతుల కుమ్ములాటలో దూడలు నగిలిపోయినట్టు సామాన్యులు అవస్థ పడ్డారు. ఇంకా పడుతున్నారు.
నవంబర్ 8 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకూ డిపాజిట్ల రూపంలో ఎంత సొమ్ము వచ్చిందనేది ఆర్బీఐ ఇప్పటికీ ప్రకటించలేకపోతోంది. చెలామణిలో ఉన్న సొమ్మంతా బ్యాంకులకు చేరిపోందని కొందరూ… అనుకున్నదానికంటే ఎక్కువ సొమ్ము డిపాజిట్ అయిందని మరికొన్ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆర్.బి.ఐ. స్పందించాల్సి ఉంది. అసలు లెక్కలు వెల్లడించాల్సి ఉంది. కానీ, నోట్ల లెక్కల్ని ఇంకా సరిచూస్తున్నామనీ, అన్నీ కొలీక్కి వచ్చాక లెక్కలు వెల్లడిస్తామని ఆర్.బి.ఐ. తాజాగా స్పందించడం విశేషం.
పెద్ద నోట్ల రద్దు తరువాతి రోజు నుంచే ఏ రోజు లెక్కల్ని ఆరోజే ఆర్.బి.ఐ. వెబ్సైట్లో పెట్టింది కదా! ఓ సందర్భంగా డిపాజిట్ అయిన సొమ్ము గురించి సాక్షాత్తూ ఆర్.బి.ఐ. గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. అంటే, గతంలో ప్రకటించిన అంకెలన్నీ లెక్కలు చూసుకోకుండానే ప్రజలకు చెప్పేశారా అనే అనుమానం కలుగుతోంది. అంతేకాదు, సరైన లెక్కలు ఇప్పటికీ తేలకపోతే… ఆ మధ్య సుప్రీం కోర్టు కోరినప్పుడు ఇచ్చిన అంకెలు సరైనవా కాదా అనే అనుమానం కూడా కలుగుతోంది కదా! కోర్టుకు ఇచ్చిన సమాచారం కూడా సరైంది కాదా అనే అభిప్రాయానికి తావిస్తోంది.
రిజర్వ్ బ్యాంకు వద్దకు లెక్కలు ప్రతీ రోజూ వచ్చేస్తాయనీ, ఒకవేళ ఏవైనా తేడాలు ఉంటే జరిమానాలు కూడా విధిస్తుందని కొంతమంది అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గడువు ముగిసినా ఇంకా ఆర్.బి.ఐ. ఎందుకు లెక్క చెప్పలేకపోతోంది? ఈ పరిస్థితిపై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సంతృప్తి పరచే విధంగా రిజర్వ్ బ్యాంక్ లెక్కలేస్తోందని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. దేశంలో గడచిన నెలన్నర రోజులపాటు డిపాజిట్ అయిన సొమ్ము ఎంతో చెప్పడానికి ఇంత సమయం ఎందుకూ అనేది అనుమానం! చెలామణిలో ఉన్న సొమ్మంతా వెనక్కి వచ్చేస్తే.. నల్లధనం మాటేంటీ? ఇండియాలో నల్లధనం లేదా..? లేదంటే… నల్లధనం కరెన్సీ రూపంలో లేదా..? ఎక్కడో తేడా కొడుతోంది.. లేదంటే భాజపా సంబరాలు ఈపాటికే భారీగా ఉండేవి కదా.