ఉన్నత విద్యలభ్యసించాలనుకొనే విద్యార్ధులకు ఆర్.బి.ఐ. గవర్నర్ రఘురాం రాజన్ చాలా చక్కటి సలహా ఇచ్చారు. నిన్న డిల్లీలో జరిగిన శివనాడార్ విశ్వద్యాలయం స్నాతకోత్సవంలో విద్యార్ధులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు చేదు వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి.
ఆయన ఏమన్నారంటే “ప్రైవేట్ కాలేజీలు, విశ్వద్యాలయాలలో విద్య రాన్రాను చాలా ఖరీదయిన వ్యవహారంగా మారిపోతోంది. వాటిలో చేరేందుకు ఆర్ధిక స్తోమత లేని విద్యార్ధులు బ్యాంకులను ఆశ్రయించి విద్యారుణాలు తీసుకొని చదువుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అటువంటి వాళ్ళని మోసం చేయడానికే అనేక బోగస్ విద్యాసంస్థలు పుట్టుకొచ్చేయి. వారిపై అవి వలలు విసురుతుంటాయి. వాటికి చిక్కితే విద్యార్ధులకు చివరికి మిగిలేవి భారీగా అప్పులు, అవిచ్చే పనికిరాని డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే. కనుక విద్యార్ధులు చాలా ఆచితూచి సరయిన విద్యాసంస్థలని ఎంచుకోవాలి,” అని అన్నారు.
బోగస్ సంస్థల వలలో విద్యార్ధులు చిక్కుకోకుండా ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసారు. బ్యాంకుల నుంచి విద్యారుణాలు తీసుకొని, వాటిని తిరిగి చెల్లించలేక ఇబ్బందిపడుతున్న విద్యార్ధులను, అలాగే విద్యాభ్యాసం ముగించుకొని తక్కువ జీతాలకు ఉద్యోగాలలో చేరిన విద్యార్ధుల పట్ల బ్యాంకులు కొంత ఉదారంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. అదే సమయంలో విద్యారుణాల వసూళ్ళ విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంటే బ్యాంకులు అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే, అవసరమయిన సందర్భాలలో మానవతా దృక్పధంతో వ్యవహరించాలని ఆయన సూచిస్తున్నట్లు భావించవచ్చు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం దొరకని విద్యార్ధులు చాలా మంది దేశవిదేశాలలోనున్న ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలలో చేరేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలో విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు కూడా బోగస్ సంస్థల చేతుల్లో తరచూ మోసపోతుంటారు. గత ఏడాది అమెరికాలోని రెండు బోగస్ విద్యా సంస్థలలో చేరేందుకు వెళ్లిన అనేక మంది విద్యార్ధులను అమెరికా ప్రభుత్వం వెనక్కి త్రిప్పి పంపడం అందరూ చూశారు. అయినా సరే, అదే సమయంలో ఇంకా చాలా మంది విద్యార్ధులు మళ్ళీ అవే విద్యాసంస్థలలో చేరేందుకు బయలుదేరి వెళ్లి చేదు అనుభవాలను మూటగట్టుకొని తిరిగిరావడం అందరూ చూశారు. దాని వలన వారికి, వారి తల్లితండ్రులకి ఎంత మనోవేదన, ఆర్ధిక సమస్యలు కలిగాయో వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ ఆ తరువాత ఆ విషయం గురించి అందరూ మరిచిపోయారు. ప్రభుత్వం కూడా. కనుక అటువంటి బోగస్ విద్యా సంస్థలను గుర్తించి విద్యార్ధులు వాటి వలలో చిక్కుకోకుండా ప్రభుత్వం తగిన యంత్రాంగం రూపొందించవలసిన అవసరం చాలా ఉంది. బ్యాంకులు కూడా ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యాసంస్థలలో చేరే విద్యార్ధులకి మాత్రమే విద్యారుణాలు ఇవ్వడం వలన ఇటువంటి మోసాలు అరికట్టవచ్చు. బ్యాంకులు, విద్యార్ధులు, వారి తల్లితండ్రులు అందరూ నష్టపోకుండా తప్పించుకోవచ్చు. రఘురామ రాజన్ ఇస్తున్న ఈ సలహాను విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు కూడా సదా గుర్తుంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.