రూ. రెండు వేల నోటును ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ రూ.రెండు వేల నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకుల్లో జమ చేయడానికి అవకాశం కల్పిస్తారు. బ్యాంకులు కస్టమర్ల నుంచి స్వీకరించే రూ. రెండు వేల నోట్లను ఎవరికీ ఇవ్వవద్దని.. చెలామణిలోకి తీసుకు రావొద్దని స్పష్టం చేసింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే రూ. రెండు వేల నోటును ఉపసంహరించుకున్నామని ఆర్బీఐ ప్రకటించింది. నిజానికి మూడేళ్ల కిందటి నుంచే రెండు వేల నోటును ముద్రించడం మానేశారు.
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రూ. రెండు వేల నోటును ఆర్బీఐ అమల్లోకి తీసుకు వచ్చింది. కానీ ఆ నోటు పెద్దల బ్లాక్ మనీ కోసం ఉపయోగపడుతోందని తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత తర్వాత అవి చెలామణిలోకి రావడం తగ్గిపోయాయి. బ్లాక్ మనీ పోగేసిన వాళ్లంతా పెద్ద నోట్ల రూపంలో పోగేసుకుని ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ బ్యాంకులకు చేరాల్సి ఉన్నాయి. పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో జమ చేస్తే ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీసే అవకాశం ఉంది.
డిజిటల్ లావాదేవీలు పెరగడం.. రూ. రెండు లక్షల కన్నా ఎక్కువ నగదు వ్యవహారాలు చేయకూడదన్న రూల్ పెట్టిన తర్వాత కూడా..అనేక చోట్ల నగదు లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీలో అయితే రోజూ వందల కోట్ల లావాదేవీలు జరిగే మద్యం, ఇసుక వ్యవహారాలు మొత్తం మనీ రూపంలోనే జరుగుతూ ఉంటాయి. ఆ మనీ అంతా ఎటు పోతుందో అనే లెక్కలు ఎవరికీ దొరకవు. ఇప్పుడు ఏమైనా బయటకు వస్తాయేమో చూడాల్సి ఉంది.